భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు లక్ష్యానికి చేరువయ్యారు. సోమవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4–1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా... మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, 37 ఏళ్ల మణిపుర్ మెరిక మేరీకోమ్ 5–0తో ఇరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై ఘన విజయం సాధించింది. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌జిత్ 5–0తో రెండో సీడ్ నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై గెలిచి సత్తా చాటింది.
సిమ్రన్‌జిత్ తొలిసారి ఒలింపిక్స్‌లో స్థానం పొందగా.. మేరీకోమ్ రెండోసారి బరిలో నిలవనుంది. అదే రోజు జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల విభాగం 63 కేజీల కేటగిరీలో మనీశ్ కౌశిక్ 2–3తో చిన్‌జోరింగ్ బాటర్‌సుక్ (మంగోలియా) చేతిలో పరాజయం కాగా.. మహిళల విభాగం 57 కేజీల కేటగిరీలో సాక్షి 0–5తో ఇమ్ ఏజి (కొరియా) చేతిలో ఓడిపోయారు. మొత్తంమీద ఈ టోర్నీ ద్వారా భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగనున్నారు.