US Open Men Singles Final : తన దేశానికే చెందిన దిగ్గజ ఆటగాడు నాదల్‌ను ఆరాధిస్తూ.. అతని బాటలో సాగుతున్న స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరాడు. అయిదు గంటలకు పైగా సాగి.. యుఎస్ ఓపెన్ చరిత్రలోనే ప్రత్యేక మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిపోయిన క్వార్టర్స్ (సిన్నర్‌పై)లో అద్భుత విజయం సాధించిన ఈ 19 ఏళ్ల ఆటగాడు సెమీస్‌లోనూ అదే పట్టుదల ప్రదర్శించాడు. నాలుగు గంటల 19 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌లో ఈ మూడో సీడ్ ఆటగాడు పైచేయి సాధించాడు. శనివారం ఉదయం ముగిసిన ఈ పోరులో అతను 6-7 (6-8), 6-3, 6-1, 6-7 (5-7), 6-3 తేడాతో 22వ సీడ్ తియోఫో (అమెరికా)పై గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో నాదల్కు షాకిచ్చి.. ఆపై రుబ్లెవ్‌ను ఓడించి సెమీస్ చేరిన తియోఫో జోరుకు అల్కరాజ్ కళ్లెం వేశాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి జయకేతనం ఎగురవేశాడు. మ్యాచ్‌లో తొలి సర్వీస్‌లను గెలుచుకోవడంలో, నెట్ దగ్గర పాయింట్లను నెగ్గడంలో అతనిదే ఆధిపత్యం. తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారులు హోరాహోరీగా తలపడడంతో టైబ్రేకర్ తప్పలేదు. అందులో ఓటమితో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అల్కరాజ్ తొలి సెట్ చేజార్చుకున్నాడు. అ తర్వాత అతను గొప్పగా పుంజుకున్నాడు. ముఖ్యంగా విన్నర్లతో చెలరేగాడు.
రెండో సెట్ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరు కొనసాగించి ఆ సెట్ దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్లో మరింతగా రెచ్చిపోయాడు. కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయాడు. తన బలమైన సర్వీస్‌లు, షాట్ల ముందు ప్రత్యర్థి తేలిపోయాడు. నాలుగో సెట్లో 3-1తో దూకుడు ప్రదర్శించిన అతను మ్యాచ్ ముగించేలా కనిపించాడు. కానీ అయిదో గేమ్‌లో బ్రేక్ సాధించిన తియోఫో గట్టి పోటీనిచ్చాడు. విన్నర్‌తో 12వ గేమ్ నెగ్గి 6-6తో స్కోరు సమం చేసి సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. అందులో మరోసారి పైచేయి సాధించాడు. దీంతో నిర్ణయాత్మక అయిదో సెట్ ఆసక్తి రేపింది. ఓ దశలో 2-2తో స్కోరు సమమై ఉత్కంఠ పెరిగింది. కానీ తీవ్ర ఒత్తిడిని చిత్తుచేస్తూ అల్కరాజ్ ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా వరుసగా రెండు గేమ్‌లు నెగ్గాడు. తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతను 6 ఏస్‌లు, 59 విన్నర్లు కొట్టాడు. తియోఫో 52 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ (2005) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా 19 ఏళ్ల అల్కరాజ్ నిలిచాడు.
రఫ్ఫాడించిన రూడ్..
మంచి ఫామ్‌లో ఉన్న ప్రపంచ ఏడో ర్యాంకర్ రూడ్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను.. ఇప్పుడు యుఎస్ ఓపెన్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. సెమీస్‌లో అయిదో సీడ్ రూడ్ (నార్వే) 7-6 (7-5), 6-2, 5-7, 6-2తో కచనోవ్ (రష్యా)ను ఓడించాడు. ఆరున్నర అడుగుల ప్రత్యర్థితో పోరులో.. తెలివిగా ఆడిన రూడ్ ఫలితం సాధించాడు. కచనోవ్ సర్వీస్ చేసినప్పుడు బేస్ లైన్‌కు దూరంగా ఉండి రిటర్న్ చేసిన రూడ్.. ఆ తర్వాత లైన్ దగ్గర నుంచి షాట్లు ఆడాడు.
జో- రామ్ జోడీదే డబుల్స్ టైటిల్
యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో లో జో సాల్స్బరీ (బ్రిటన్)- రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ టైటిల్ నిలబెట్టుకుంది. గతేడాది విజేతగా నిలిచిన టాప్‌సీడ్ జో- రాజీవ్ ద్వయం.. ఈ సారి ఫైనల్లో 7-6 (7-4), 7-5 తేడాతో వెస్లీ (నెదర్లాండ్స్), నీల్ (బ్రిటన్)పై గెలిచింది.
తియోఫో అభిమాని మిషెల్లె ఒబామా
తియోఫో, అల్కరాజ్ మధ్య సెమీస్ మ్యాచ్‌కు ఓ ప్రముఖ అతిథి హాజరయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లె ఒబామా ఈ మ్యాచ్‌ను కోర్టుకు సమీపంలోనే మొదటి వరుస స్టాండ్స్‌లో కూర్చుని వీక్షించారు. తమ దేశ ఆటగాడు తియోఫోను ఉత్సాహపరుస్తూ ఆమె కేకలు వేశారు. ఈ పోరులో పోరాడి ఓడిన అతను.. మ్యాచ్ అనంతరం ఆమెతో మాట్లాడాడు. "మిషెల్లె నా ఆట చూసేందుకు ఉత్తేజం ప్రదర్శించారు. ఆమెను కోర్టు పక్కన చూసిన తర్వాత నేను ఓ సర్వీస్ రిటర్న్ చేయలేకపోయా. దీంతో సర్వీస్ కూడా రిటర్న్ చేయలేకపోతున్నాడని నా గురించి ఆమె అనుకుంటారని భావించా. ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. మ్యాచ్ తర్వాత ఆమెను కలిసే అవకాశం దక్కింది. ఈ రాత్రి నమ్మశక్యంగా అనిపించలేదు" అని తియోఫో పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:పాక్ వర్సెస్ శ్రీలంక.. ఆసియాకప్ ఎవరిది? నేడే ఫైనల్!
టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్ ఇండియా ఎంపిక అప్పుడే.. ఆ ఇద్దరి వల్లే ఆలస్యం