టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు త్వరలోనే కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కరోనా యోధులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ఆటగాళ్లకు టీకా వేయనున్నట్లు స్పష్టం చేశారు.
"ఫ్రంట్‌లైన్ వారియర్స్ తర్వాత వ్యాక్సినేషన్లో అథ్లెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరాం. వారి నుంచి సమాధానం రాగానే టీకా పంపిణీ ప్రారంభిస్తాం. టోక్యో ఒలింపిక్స్‌కు ఇంకా తగినంత సమయం ఉంది. దీంతో నిర్ణీత సమయం లోపే ఆ ఆటగాళ్లకు టీకా ఇవ్వగలమనే నమ్మకం ఉంది" అని క్రీడల మంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది పలు అంతర్జాతీయ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆటలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. దేశంలో మరిన్ని ప్రపంచ క్రీడలు జరగాలని ఆకాంక్షించారు.
గుజరాత్లో పునర్నిర్మించిన మొతేరా స్టేడియం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ఇదే మైదానంలో మొదలు కానుంది.
ఇదీ చదవండి: కివీస్‌తో తొలి టీ20లో ఆసీస్ పరాజయం