హరియాణాలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ భాజపాలో చేరారు. వీరితో పాటు అకాలీ దళ్ ఎమ్మెల్యే బాల్కౌర్ సింగ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాడు యోగేశ్వర్. రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఎంతో సేవ చేయవచ్చని మోదీ నిరూపించారని పేర్కొన్నాడు.
క్రీడాకారునిగా సేవలందించిన తాను... ఇప్పుడు రాజకీయాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు సందీప్ సింగ్.
హరియాణాకు చెందిన రెజ్లర్... యోగేశ్వర్ దత్ 2012 ఒలింపిక్స్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. 2013లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
ఈ కుస్తీ వీరుడు త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది.
సందీప్ సింగ్...
2006లో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డ భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ ఏడాది పాటు వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. అనంతరం కోలుకుని 2010 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం.. హరియాణా పోలీస్‌శాఖలో డీఎస్పీ ర్యాంకుతో ఉన్న సింగ్ జీవితకథను 'సూర్మా' పేరుతో బాలీవుడ్ సినిమాగా రూపొందించారు.
ఇదీ చూడండి:ఇంజినీరింగ్ విద్యలో సంస్కృత భాష!