వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత మహిళా హాకీ జట్టు అర్హత సాధించింది. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్ రెండో మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో 1-4 తేడాతో పరాజయం పాలైనా.. గోల్స్ లెక్కలతో భారత్ ఒలింపిక్స్‌కు బెర్త్ ఖరారు చేసుకుంది. ఇదే వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 5-1 తేడాతో నెగ్గింది.
దీంతో రెండు మ్యాచుల్లో కలిపి మొత్తంగా భారత్ అమెరికా కంటే గోల్ ఆధిక్యంలో నిలవడటంతో రాణి సేన టోక్యో విమానం ఎక్కనుంది.
మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది భారత మహిళా జట్టు. ఐదో నిమిషంలోనే మగదన్ గోల్ కొట్టడంతో అమెరికా ఖాతా తెరిచింది. మూడో క్వార్టర్ ముగిసేసరికి యూఎస్‌ఏ 4-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది.
భారత్ ఎంత ప్రయత్నించినా గోల్ సాధ్యపడలేదు. దూకుడుగా ఉన్న అమెరికా జట్టును చూసి భారత ఒలింపిక్స్ ఆశలకు గండిపడుతుందని భావించారంతా. కానీ, ఆఖరి క్వార్టర్‌లో కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ కొట్టడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రతిఘటించినా రాణిసేన ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.
ఇదీ చదవండి: ధోనీ, కోహ్లీ రికార్డులపై హిట్‌మ్యాన్ కన్ను