బెంగళూరు సాయ్ సెంటర్‌కు చెందిన వంట మనిషి కరోనాతో మృతి చెందినప్పటికీ అక్కడ ఉంటున్న భారత పురుషుల హాకీ జట్లను తరలించబోమని హాకీ ఇండియా స్పష్టం చేసింది. సోమవారం గుండెపోటుతో మరణించిన ఆ వంట మనిషికి కరోనా సోకినట్లు తర్వాత తేలిందని ఓ సాయ్ అధికారి చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, క్రీడాకారుల బస చేస్తున్న ప్రాంతంలోకి అతడికి ప్రవేశం లేదని తెలిపారు.
"బెంగళూరు సాయ్ కేంద్రం నుంచి జట్లను తరలించే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ అత్యుత్తమ సదుపాయాలు ఉన్నాయి" అని హెచ్‌ఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎలెనా నొర్మాన్ చెప్పారు. మార్చి 10 తర్వాత వంట మనిషి గేట్ ఏరియా దాటలేదని ఓ సాయ్ అధికారి తెలిపారు. "పెద్ద వయసు ఉద్యోగులను మార్చి 10 నుంచి ఇంటి వద్దే ఉండమని చెప్పాం. అందులో వంట మనిషి ఉన్నాడు" అని స్పష్టం చేశారు. "సాయ్ కేంద్రంలో మూడు విభాగాలు ఉన్నాయి. అవి గేట్ ఏరియా, సెక్టార్-ఏ, సెక్టార్-బి. క్రీడాకారులు సెక్టార్-బి చివర్లో ఉంటారు. కాబట్టి క్రీడాకారులు పూర్తిగా సురక్షితం" అని వివరించారు. ఈ నెల 15న వంట మనిషి సాయ్ సెంటర్‌కు వచ్చినా.. అతణ్ని గేట్ ఏరియా దాటనివ్వలేదు.
ఇదీ చూడండి.. '28 ఏళ్ల అనుబంధం.. ఇప్పుడు చాలా వెలితిగా ఉంది'