ఏ క్రీడల్లోనైనా అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా పోటీలుంటాయి. ప్రాక్టీస్ సందర్భంగా అప్పుడప్పుడు కలిసి ఆడినప్పటికీ పురుషుల మ్యాచ్ల్లో మహిళలను చూడడం అసాధ్యమే. కానీ, దాన్ని అందుకునే దిశగా జపాన్ ఫుట్బాల్ దిగ్గజం యుకి నగాసతొ అడుగు వేసింది. ఆటల్లో లింగ సమానత్వం కోసం పోరాడుతున్న అమెరికా ఫుట్బాల్ క్రీడాకారిణి మెగాన్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న యుకి.. పురుషుల జట్టులో చేరింది.
"ప్రపంచకప్లో లింగ భేదం గురించి మెగాన్ చెప్పిన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. పురుషుల జట్టులో అమ్మాయి కూడా ఆడగలదు అని నిరూపించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నా"
- యుకి నగాసతొ, జపాన్ ఫుట్బాల్ క్రీడాకారిణి
తన దేశానికి చెందిన హయబూస ఎలెవన్ జట్టు తరపున కనగావ ప్రాంతీయ లీగ్లో ఆడనుంది. ఆ జట్టు తరపున ఆడబోతున్న తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. తన అన్న జెంకీ కూడా అదే జట్టులో ఉండడం విశేషం. 2011 మహిళల ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో 31 ఏళ్ల యుకి సభ్యురాలు. అమెరికా జాతీయ మహిళల ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్లో చికాగో రెడ్స్టార్స్ తరపున ఆడింది.