ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కీలక ముందడుగు వేసింది. రూ.6 కోట్లతో నగరంలో కొత్తగా ఫుట్‌బాల్ మైదానం నిర్మించేందుకు నడుం బిగించింది. ఇందుకు ఫలక్‌నుమా కళాశాల ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకుంది.
రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌లో కొత్త ఫుట్‌బాల్ మైదానం కోసం సన్నాహాలు ప్రారంభమవగా.. ముందు బార్కస్‌లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ స్థానిక సమస్యల కారణంగా ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఆలోచన మారింది. ఫలక్‌నుమా కళాశాలలోని ఖాళీ స్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో ఫుట్‌బాల్ మైదానాన్ని తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ మైదానంలో గదులు, పెవిలియన్ 512 చదరపు మీటర్లలో నిర్మించనుండగా.. ఫుట్‌బాల్ పిచ్ 5,194 చ.మీటర్లలో ఉండనుంది. గ్యాలరీ విస్తీర్ణం 430 చ.మీ. మొత్తంగా 9,593 చ.మీల్లో స్టేడియాన్ని తీర్చిదిద్దనున్నారు.