ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో అట్లెటికో డి కోల్‌కతా మూడోసారి విజేతగా నిలిచింది. గోవాలోని ఖాళీ స్టేడియంలో శనివారం జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో 3-1 తేడాతో చెన్నయిన్ ఎఫ్‌సీపై గెలిచింది. కోల్‌కతా తరపున జేవియర్ హెర్నాండెజ్ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తాచాటాడు. గార్సియా (48వ నిమిషంలో) ఓ గోల్ కొట్టాడు. చెన్నయిన్ జట్టులో నెరిజుస్ (69వ నిమిషంలో) గోల్ చేశాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి కోల్‌కతా పూర్తి ఆధిపత్యం చలాయించింది. పోరు మొదలైన పది నిమిషాలకే జేవియర్ గోల్ కొట్టి ఆ జట్టు ఖాతా తెరిచాడు. కృష్ణ నుంచి బంతి అందుకున్న అతడు ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కట్టించి బంతిని లోపలికి పంపించాడు. చెన్నై గోల్ ప్రయత్నాన్ని వృథా చేసి, తొలి అర్ధభాగాన్ని కోల్‌కతా 1-0తో ముగించింది. విరామం తర్వాత గార్సియా గోల్ చేసి ఆధిక్యాన్ని పెంచడం వల్ల విజయం దిశగా ఆ జట్టు పరుగులు పెట్టింది. అయితే నెరిజుస్ గోల్ చేసి చెన్నయిన్‌కు ఆశలు కల్పించాడు. కానీ ఆ తర్వాత ఆ జట్టు కోల్‌కతా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. చివర్లో ఇంజూరీ సమయంలో జేవియర్ మరో గోల్ కొట్టి కోల్‌కతాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.