భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన జట్టులో ఈయన సభ్యుడు. భారత్ తరఫున 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ప్రదీప్.. 65 గోల్స్ సాధించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా కోచ్‌గానూ పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తమ్ముడు ప్రసూన్ బెనర్జీ, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో ఎంపీగా ఉన్నారు.
1936లో జన్మించిన బెనర్జీ.. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. బలమైన ప్రత్యర్థి ఫ్రెంచ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లోనూ 'మెన్ ఇన్ బ్లూ'కు ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్‌లో భారత్, 4-2 తేడాతో విజయం సాధించడంలో ఆయనదే ముఖ్య భూమిక. భారత ఫుట్‌బాల్‌కు బెనర్జీ చేసిన సేవలకుగానూ, ప్రపంచ పాలక మండలి ఫిఫా గుర్తించి 2004లో సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేసింది.