.
ఈ చిత్రం చూశారా? స్టేడియాల్లో ఇలాంటి సందడి చూసి ఎన్నాళ్లయిందో అనిపిస్తోందా? ఇది పాత చిత్రం అని ఫిక్సయిపోయారా? అయితే తప్పులో కాలేసినట్లే! ఇది 'కరోనా' కాలంలోనిదే. తాజా చిత్రమే. మూడు రోజుల కిందట నిర్వహించిన హంగేరియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన దృశ్యమిది. అక్కడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా ఆటల సందడి మళ్లీ మొదలవుతోంది. ఇంకో నెల రోజుల్లో అన్ని ఆటల్లోనూ 'లైవ్' చూడబోతున్నట్లే!
కరోనా ధాటికి మూడు నెలల పాటు స్తబ్దుగా ఉన్న క్రీడా ప్రపంచంలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. ఇప్పటికే ఐరోపా దేశాల్లో అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ఆట మైదానాల్లో సందడి చేస్తోంది. కరోనా వల్ల ఆగిపోయిన హంగేరియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించారు. మెజోకోవిజ్డ్‌పై బుడాపెస్ట్ క్లబ్ నెగ్గిన ఈ మ్యాచ్‌కు పది వేల మంది దాకా అభిమానులు హాజరయ్యారు. మరోవైపు వియత్నాంలో ఫుట్‌బాల్ సందడి మొదలైంది. హో చి, మిన్ సిటీ-హై ఫాంగ్ జట్ల మధ్య మ్యాచ్‌కు అభిమానుల్ని అనుమతించారు. వేల మంది దాకా స్టేడియంలో మ్యాచ్ చూశారు. దక్షిణ కొరియాలో కె-లీగ్‌ను మాత్రం అభిమానులు లేకుండానే నిర్వహించారు.
మరోవైపు టెన్నిస్‌లోనూ సందడి మొదలైంది. క్రీడాకారులు సాధన ఆరంభించారు. వార్మప్ కోసం స్టార్లు చిన్న చిన్న టోర్నీలు ఆడుతున్నారు. ఆగస్టు-సెప్టెంబరు మధ్య యుఎస్ ఓపెన్ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫార్ములావన్ సందడి మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. హాకీ, బ్యాడ్మింటన్ లాంటి పెద్ద క్రీడల్లోనూ టోర్నీలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రికెట్ ఆ సిరీస్‌తో...
వచ్చే నెల 8న అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం కానుంది. వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ సజావుగా సాగితే.. మిగతా బోర్డుల్లో కూడా కదలిక వస్తుంది. విండీస్‌తో వెంటనే తామూ ఓ సిరీస్ ఆడేద్దామని పాకిస్థాన్ చూస్తోంది. ఇంగ్లాండ్-విండీస్ సిరీస్‌ను బట్టే దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన కూడా ఖరారయ్యే అవకాశముంది. ఆపై ఆస్ట్రేలియా పర్యటన ఉంటుంది. టీ20 ప్రపంచకప్ సంగతేంటో తేలితే.. అక్టోబరు-నవంబరు మధ్య ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.
భయం లేకపోలేదు..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడల్లోనూ తిరిగి టోర్నీలు పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని క్రీడల్లో మ్యాచ్‌లు మొదలయ్యాయి కూడా. అయితే ఆటగాళ్లలో, నిర్వాహకులు అంత ధీమాగా అయితే లేరు. కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో వచ్చే నెల 8 నుంచి వెస్టిండీస్ పర్యటనకు జోరుగా ఏర్పాట్లు జరుగుతుండగా.. డారెన్ బ్రావో, హెట్‌మయర్, కీమో పాల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు కరోనా భయమే కారణమని వెల్లడైంది.
టెన్నిస్‌లో మిగతా క్రీడాకారులు అప్పుడే మ్యాచ్‌లు ఆడేస్తున్నారు కానీ.. నాదల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాడు మాత్రం కరోనా భయం పూర్తిగా తొలగిపోయి, సురక్షిత వాతావరణ నెలకొన్నాకే మైదానంలో అడుగు పెడతానంటున్నాడు. క్రికెటర్లలో చాలామందిని వైరస్ భయం వెంటాడుతోంది. అందుకే ఇంకా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టట్లేదు. భారత క్రికెటర్లకు శిక్షణ శిబిరం నిర్వహించే విషయమై బీసీసీఐలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి.