ఛాంపియన్స్ లీగ్‌లో బాయర్న్ మ్యూనిక్ హవా కొనసాగింది. ఈ జట్టు ఫైనల్లో ఫ్రెంచ్ పవర్‌హౌజ్ పారిస్ సెయింట్ జెర్మైన్పై గెలిచి ఆరో సారి టైటిల్ ఎగరేసుకుపోయింది. లిస్బన్ వేదికగా జరిగిన తుదిపోరులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం వహించింది మ్యూనిక్.
ఈ టైటిల్‌తో ఎక్కువసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన మూడో జట్టుగా ఘనత వహించింది బాయర్న్. లా లిగా ఛాంపియన్ రియల్ మాడ్రిడ్ 13 సార్లు, సిరీస్ ఏ జట్టు ఏసీ మిలన్ ఏడు సార్లు ఈ టైటిల్ సాధించి ముందున్నాయి. అలాగే ఈ లీగ్‌లో ఒక్క పాయింట్ కూాడా కోల్పోకుండా 100 శాతం విజయాలతో రికార్డు సృష్టించింది బాయర్న్ మ్యూనిక్ జట్టు.
ఈ రెండు జట్లకు అత్యధిక గోల్స్ చేయగల సామర్థ్యం ఉన్నా ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. తర్వాత బాయర్న్ మిడ్ ఫీల్డర్ కింగ్స్ లే కోమన్ 59వ నిముషంలో గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత ఇదే ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న మ్యూనిక్ ఆరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. పీఎస్జీ స్టార్ స్ట్రైకర్స్ నెయిమర్, ఎంబపే విఫలమవడం జట్టును దెబ్బతీసింది.