దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా(Diego Maradona News).. తనపై అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశాడని తాజాగా ఓ మహిళ సంచలన విషయాలు బయటపెట్టారు. గతేడాది నవంబర్ 25న మారడోనా ఓ శస్త్ర చికిత్స అనంతరం కన్నుమూశారు. అయితే, ఇటీవల అతడికి సంబంధించిన కొన్ని విషయాలపై క్యూబాకు చెందిన 37 ఏళ్ల మహిళ పలు ఆరోపణలు చేశారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, భౌతిక దాడులు వంటి నేరాలకు మారడోనా అనుచరులు పాల్పడ్డారని ఆమె ఇటీవల అమెరికన్ మీడియా వద్ద ప్రస్తావించారు.
ఈ వ్యవహారంలో బాధిత మహిళ వారిపై ఫిర్యాదు చేయకపోయినా అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆమె.. గతవారం కోర్టు విచారణకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను టీనేజ్‌లో ఉండగా మారడోనాతో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. 'నేను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిశాను. అప్పుడు ఆయన డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన చికిత్సలో భాగంగా క్యూబాకు వచ్చాడు. ఆ సమయంలో నాపై ఓ సందర్భంలో అత్యాచారం చేశాడు. అప్పుడు మారడోనాతో నాలుగైదేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నా. అప్పుడు నన్ను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేశాడు. పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేశాడు. దీంతో అమితంగా ఇష్టపడిన అతడిని తర్వాత అసహ్యించుకున్నా' అని ఆమె తన బాధను పంచుకున్నారు.
ఇకపై ఈ విషయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, తాను చెప్పాల్సింది మొత్తం కోర్టుకు తెలిపానని బాధిత మహిళ అన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాలపై నోరు విప్పడం సంతోషంగా ఉందన్నారు. తనలాంటి పరిస్థితి మరెవరికీ ఎదురవ్వద్దని, అలాగే తనలా బాధపడిన యువతులు ఇకనైనా ధైర్యం చేసి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే తానీ విషయాలపై మౌనం వీడానన్నారు. కాగా, ఈ కేసు విచారణ ఎదుర్కొంటున్న మారడోనా అనుచరులు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని కోర్టుకు విన్నవించడం గమనార్హం.
ఇదీ చదవండి: