Yuvraj Singh Birthday: అతడి పేరు వింటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. దూకుడైన ఆటతీరుతో క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. స్టైలిష్ బ్యాటింగ్‌తో అదరగొడతాడు. ప్రత్యర్థి కవ్విస్తే రెచ్చిపోతాడు. సహచర ఆటగాళ్లు విఫలమైతే వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ ఆటపట్టిస్తూ మైదానంలోనైనా, బయటైనా ఓ రకమైన ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఓవైపు కేన్సర్‌లాంటి మహమ్మారి తన శరీరాన్ని తొలిచేస్తున్నా.. కోట్లమంది అభిమానుల కలగా మారిన ప్రపంచకప్ కోసం వీరోచితంగా పోరాడాడు. గెలిచాడు. గెలిపించాడు. అతడే ది గ్రేట్ వారియర్ యువరాజ్ సింగ్. ఈ స్టైలిష్ బ్యాటర్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అతడి కెరీర్‌లోని ఆసక్తికర విషయాల్ని గుర్తుచేసుకుందాం.
- 2000 సంవత్సరం జనవరిలో శ్రీలంకను ఓడించి భారత్ అండర్-19 ప్రపంచకప్ నెగ్గింది. ఈ టోర్నీలో యువరాజ్ 33.83 సగటుతో 203 పరుగులు చేశాడు. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో బౌలింగ్‌లోనూ ఆకట్టుకుని టీమ్ఇండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
- అదే ఏడాది అక్టోబరులో కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు యువరాజ్. నైరోబిలో ఈ మ్యాచ్ జరిగింది.
- అనంతరం ఇదే నెలలో(అక్టోబరు 2000) జరిగిన ఐసీసీ ప్రపంచకప్ నాకౌట్ టోర్నమెంట్లో సత్తాచాటాడు. ఆస్ట్రేలియాపై 80 బంతుల్లో 84 పరుగులు చేసి భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
- 2002 జులైలో క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ కైఫ్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 69 పరుగులతో సత్తాచాటాడు యూవీ. ఫలితంగా భారత్ 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లీష్ గడ్డపై చారిత్రక విజయాన్ని అందుకుంది.
- 2004 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు యువరాజ్. 122 బంతుల్లో 139 పరుగులు చేశాడు.
- 2006 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో భారత్ 5 వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో యూవీ రెండు అర్ధశతకాలతో(87, 79) సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే సిరీస్‌లో 93 బంతుల్లో 107 పరుగులు చేసి భారత్‌కు విజయాన్నందించాడు.
పొట్టి ప్రపంచకప్‌లో విశ్వరూపం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Yuvraj Singh six sixes: 2007 సంవత్సరాన్ని భారత క్రికెట్ ప్రియులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్థాన్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది భారత్. సెప్టెంబరులో జరిగిన ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌పై రికార్డు అర్ధశతకం నమోదు చేశాడు యూవీ. 12 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. టీ20ల్లో ఇదే అతి వేగవంతమైన అర్ధశతకం. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు నమోదు చేశాడు యూవీ.
- 2007 డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 169 పరుగులు చేశాడు యూవీ. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది భారత్.
విశ్వసమరంలో విధ్వంసమే..
Yuvraj Singh 2011 World Cup: 2011 ఫిబ్రవరి 19- ఏప్రిల్ 2 మధ్యలో వన్డే ప్రపంచకప్ జరిగింది. 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో యూవీ 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ రికార్డు సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా యువరాజ్ రికార్డు సృష్టించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్యాన్సర్‌ను జయించి..
ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల సమయంలోనే యూవీ ఇబ్బందిపడినట్లు కనిపించాడు. ఓ సమయంలో నోటి నుంచి రక్తం వస్తున్నా పోరాడాడు. ఈ టోర్నీ అనంతరం తనకు క్యాన్సర్ అని వెల్లడించాడు యూవీ. అనంతరం ఈ మహమ్మారిని జయించి అంతర్జాతీయ మ్యాచుల్లో తర్వాతి ఏడాదే పునరాగమనం చేశాడు.
2017 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రీఎంట్రీ?
Yuvraj Singh Return: రెండేళ్ల క్రితం క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. పబ్లిక్ డిమాండ్ మేరకు తిరిగి ఆడనున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. దాంతో పాటే 2017 జనవరిలో ఇంగ్లాండ్‌పై చేసిన 150 పరుగులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. "దేవుడు మీ విధిని నిర్ణయిస్తాడు. ప్రజల కోరిక మేరకు నేను ఫిబ్రవరిలో పిచ్ మీదకు అడుగుపెట్టే అవకాశం ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. టీమ్ఇండియాకు మద్దతిస్తూ ఉండండి. నిజమైన అభిమాని కఠిన పరిస్థితుల్లోనే జట్టుకు అండగా నిలుస్తారు" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఇతడు టీ20 లీగుల్లో ఆడతాడని కొంతమంది చెబుతుంటే.. మరికొందరు ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీకి మెంటార్‌గా మారబోతున్నాడని మరికొందరు అంటున్నారు.
యూవీ ప్రస్థానం
2000 అక్టోబర్‌లో అరంగేట్రం చేసిన యువీ (Yuvraj Singh Stats).. దేశం తరఫున 304 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 8701 పరుగులు, సుదీర్ఘ ఫార్మాట్లో 1900 పరుగులు చేశాడు. వన్డేల్లో 111 వికెట్లు కూడా తీశాడు.