న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్‌ఇండియానే విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌పైన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. గతేడాది ఆసీస్ సొంత గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్లతో చెరో టెస్టు సిరీస్‌లో తలపడగా.. కివీస్‌పై గెలుపొందిన కంగారూలు.. భారత్‌తో పోటీపడి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే భారత్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కచ్చితంగా గెలుస్తుందని పైన్ అంచనా వేశాడు. అలాగే, టీమ్‌ఇండియాలాగే ఆస్ట్రేలియా కూడా బలమైన బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని పైన్ అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పలువురు సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ప్రస్తుతం కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు ఒక బృందంగా వెళ్లగా, వచ్చేనెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ధావన్ నేతృత్వంలోని మరో జట్టు బయలుదేరి వెళ్లనుంది. ఈ క్రమంలోనే తమ జట్టును కూడా అలా ఎక్కువ మంది ఆటగాళ్లతో బలంగా తీర్చిదిద్దాలని పైన్ చెప్పుకొచ్చాడు.
"ఇప్పుడు మా జట్టును మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అలాంటప్పుడు సీనియర్లు ఆడకున్నా ఫర్వాలేదు. ఇప్పుడు టీమ్‌ఇండియాను మనం అలాగే చూస్తున్నాం. వాళ్లు జట్టును సహేతుకంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు నాణ్యమైన ఆటగాళ్లు దొరకడం వల్ల టెస్టు క్రికెట్ కూడా ఆడగలరు. మేం కూడా అలాంటి స్థితికి చేరాల్సి ఉంది. దాంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. వారు తిరిగి ఆడేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అప్పుడు మరింత బాగా ఆడతారు" అని పైన్ వివరించాడు. కాగా, వెస్టిండీస్ టూర్‌కు దూరమయ్యేవారిలో స్మిత్, వార్నర్, కమిన్స్, మాక్స్‌వెల్, స్టోయినిస్, జై రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: శునకంతో రవిశాస్త్రి క్యాచ్‌ల ప్రాక్టీస్.. వీడియో వైరల్