సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్-టీమ్ఇండియా మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు పలుమార్లు అడ్డుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో రిజర్వ్ డేగా కేటాయించిన అదనపు రోజున కూడా ఆట కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆరో రోజుకు సంబంధించి టికెట్లను అమ్మకానికి పెట్టింది ఐసీసీ. అది కూడా గతంలో ఉన్న రేట్ల కంటే తగ్గించి విక్రయిస్తోంది.
ఇప్పటికే తొలి రోజు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. తర్వాతి రెండ్రోజులు పూర్తి ఓవర్ల ఆట సాధ్య పడలేదు. నాలుగో రోజు ఆటలోనూ తొలి సెషన్ పూర్తిగా రద్దు అయింది. ఒక్క బంతి పడకుండానే లంచ్ విరామానికి వెళ్లారు ఆటగాళ్లు. మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో ఆట ప్రారంభమయ్యేది అనుమానంగానే మారింది.
రేట్ల వివరాలు..
డబ్ల్యూటీసీ మ్యాచ్ కోసం టికెట్లను మూడు స్లాబ్‌లుగా కేటాయించింది ఐసీసీ.
- మొదటి స్లాబ్ ధర గతంలో రూ.15,444 (150 పౌండ్లు) ఉండగా.. ప్రస్తుతం రూ.10,296 (100 పౌండ్లు)కి విక్రయిస్తోంది.
- రెండో స్లాబ్ ధర గతంలో రూ.10,296 (100 పౌండ్లు) ఉండగా.. ప్రస్తుతం రూ. 7,722 (75 పౌండ్లు)కి విక్రయిస్తోంది.
- మూడో స్లాబ్ ధర గతంలో రూ.7,722 (75 పౌండ్లు) ఉండగా.. ప్రస్తుతం రూ.5,148 (50 పౌండ్లు)కి విక్రయిస్తోంది.
ఇదీ చదవండి: WTC Final: క్రికెట్ స్టేడియంలో సినిమా గోల