యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ (sushil kumar) విచారణలో సహకరించడం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆదివారం అరెస్టయిన సుశీల్‌కు కోర్టు ఆరు రోజుల రిమాండ్ విధించగా.. అప్పట్నుంచి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతణ్ని ప్రశ్నిస్తున్నారు.
అయితే హత్య కేసు విచారణ సందర్భంగా సుశీల్‌కు కాలా, నీరజ్ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలున్నట్లు తేలింది. ముందు కాలాతో కలిసి సాగిన సుశీల్.. తర్వాత అతడి శత్రువైన నీరజ్‌తో సంబంధాలున్నట్లు వెల్లడైంది. దిల్లీలోని మోడల్ టౌన్‌లో సాగర్ అద్దెకు ఉన్న సుశీల్ ఇంటి విషయంలో కొన్ని నెలలుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నడుస్తోందని.. సాగర్, అతడి స్నేహితులపై సుశీల్ బృందం దాడి చేయడానికి పరోక్షంగా ఈ గొడవే కారణమని పోలీసులు అంటున్నారు.
కాగా గ్యాంగ్‌స్టర్లతో సంబంధాల గురించి విచారణలో పోలీసులు అడిగితే సుశీల్ ఏమీ జవాబు చెప్పలేదని.. మౌనం వహిస్తున్నాడని పోలీసు వర్గాలు మీడియాకు వెల్లడించాయి. సాగర్ మీద తాను దాడి చేయనే లేదని, రెండు వర్గాలు గొడవ పడుతుంటే దాన్ని ఆపడానికే ప్రయత్నించానని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సాగర్ హత్య కేసులో సుశీల్‌ను ఇరికించడానికి కుట్ర జరుగుతోందని, అతను అమాయకుడని తన లాయర్ మీడియాకు చెప్పాడు.
మరో నలుగురి అరెస్టు
సాగర్ రాణా హత్య కేసు విచారణ క్రమంలో దిల్లీ పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. భూపేందర్, మోహిత్, గులాబ్, మంజీత్ అనే ఈ నలుగురూ సుశీల్ సహాయకులని తెలిసింది. వీరు సాగర్, అతడి మిత్రుడిపై జరిపిన దాడిలో భాగస్వాములుగా అనుమానిస్తున్నారు. అలాగే సంబంధాలున్నట్లుగా భావిస్తున్న రౌడీ గ్యాంగుల్లోనూ వీరి జోక్యం ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇదీ చూడండి రెజ్లర్ సాగర్ రానా మృతికి కారణమిదే!