మార్చిలో ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. సోమవారం జరిగిన లీగ్ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు వివిధ టీమ్‌లకు ఎంపికయ్యారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు గురించి ఓ సారి తెలుసుకుందామా..
- కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణి భారత్ తరఫున 6 టీ20లు మ్యాచ్‌లు ఆడింది. ఈమెను 55 లక్షలు ధరకు యూపీ వారియర్స్ ఎంపిక చేసుకున్నారు.
- అండర్-19 ప్రపంచకప్ జట్టు ప్లేయర్, వైజాగ్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన వి.స్నేహ దీప్తి భారత్ తరఫున 1 వన్డే, 2 టీ20లు ఆడి తన ప్రతిభను కనబరించింది. ఈమెను దిల్లీ క్యాపిటల్స్ టీమ్ రూ 30 లక్షలకు ఎంపిక చేసుకుంది.
- విజయవాడకు చెందిన సబ్బినేని మేఘన..టీమ్ఇండియా తరఫున 3 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈమెను గుజరాత్ జెయింట్స్..రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు.
- హైదరాబాద్ వాసి పేస్ బౌలర్ సొప్పదండి యషశ్రీ ఇటీవల అండర్–19 ప్రపంచ కప్‌లో ఆడింది. ఈమెను యూపీ వారియర్స్ టీమ్ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి.. భారత్ తరఫున 26 టీ20లు ఆడింది. ఈమెను రూ.30 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎంపిక చేసుకుంది.
- వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉండగా... అండర్-19 మహిళల ప్రపంచకప్-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది.