ఛాంపియన్‌షిప్ ఏదైనా గెలుపే ప్రధానం.. విజేతను తేల్చడమే దాని ఉద్దేశం.. మరి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ డ్రా అయితే పరిస్థితి ఏంటి? రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారా? ఫలితం వచ్చేంత వరకు ఆడిస్తారా? ఇంతకీ ఐసీసీ ఏం చేయనుంది?
టెస్టు ఛాంపియన్‌షిప్ రెండేళ్ల కాలపరిమితో ప్రవేశపెట్టిన టోర్నీ. 2019లో మొదలైంది. 2021లో ముగుస్తోంది. మొదట ఎక్కువ పాయింట్లు సాధించిన రెండు జట్లు ఫైనల్ ఆడేతాయని ప్రకటించారు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండానే విజయాల శాతం ఆధారంగా ఫైనల్‌కు అర్హత ఉంటుందని నిబంధనలు మార్చేశారు. ఇదేంటని అడిగితే కరోనా వైరస్, జట్లు ఎక్కువగా సిరీసులు ఆడటం లేదని జవాబిచ్చారు. ఇప్పుడు ఫైనల్స్ ఫలితంపైనా అలాంటి సందిగ్ధమే ఏర్పడింది.
సాధారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో గెలుపోటములే కాకుండా జట్లు డ్రా చేసుకోవచ్చు. కానీ ఛాంపియన్‌షిప్ ఆడినప్పుడు ఫలితం తేలకుంటే ఏంటన్న సందిగ్ధం మొదలైంది. న్యూజిలాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. ఛాంపియన్‌షిప్‌కు అర్థం ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకోసమే ఆరో రోజు ఆటను కొనసాగించాలని ఐసీసీ భావిస్తోందని సమాచారం. విజయం తేల్చేందుకే ఆరో రోజు ప్రవేశపెట్టాలని అనుకున్నా.. ప్రస్తుతం అది రిజర్వు డే అని చెబుతోంది.
టెస్టులో రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదు రోజులకు 450 ఓవర్లు వేయాలి. పరిస్థితులు అనుకూలించక ఆయా రోజుల్లో ఆట త్వరగా ముగిస్తే మిగిలిన ఓవర్లను ఆరో రోజు వేయించాలన్నది ఐసీసీ ప్రణాళికగా తెలుస్తోంది. ఐదు రోజుల్లో 30 గంటలు కనీసం ఆట సాగాలి. అలా లేకుంటే ఆరో రోజు ఆడించొచ్చు. ప్రస్తుతానికి ఈ అంశంపై స్పష్టత లేదు. జూన్ 1న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించాక నిర్ణయం తీసుకోవచ్చు.
ఇదీ చూడండి ఈ వివక్షను పూర్తిగా తొలగించాలి: హోల్డింగ్