టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శుక్రవారం తన అభిమానులను అలరించాడు. ఐపీఎల్ 14వ సీజన్ అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల ఇంటికే పరిమితమైన అతడు కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో రూపొందించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బ్యాటింగ్‌లో దుమ్మురేపే గబ్బర్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. వర్షం కురిసే వేళ అందమైన బాల్కనీలో కూర్చొని ఓ పాటకు ఫ్లూట్ వాయించాడు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే నెటిజెన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇటీవల కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌లో గబ్బర్ రెచ్చిపోయాడు. దిల్లీ తరఫున మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో 380 పరుగులు చేసి అందరికన్నా ముందున్నాడు. మరోవైపు వచ్చే నెలలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సైతం ధావన్ ఎంపికవ్వలేదు. దీంతో ప్రస్తుతం కుటుంబంతోనే ఉన్నాడు. అయితే, జులైలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఆడనున్నాడు. ఆ బృందానికి ధావన్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: హాకీ ఇండియాకు ప్రతిష్టాత్మక అవార్డు