టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్(T20 world cup 2021 Ind vs Pak) అనంతరం మహ్మద్ రిజ్వాన్ చేసిన నమాజ్‌ను ఉద్దేశించి.. తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై(Waqar Younis statement) క్షమాపణ చెప్పాడు పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్. ఈ విషయమై అతడిపై ప్రపంచవ్యాప్తంగా మాజీ క్రికెటర్లు సహా అభిమానులు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో క్షమాపణలు(Waqar Younis news ) చెప్పాడు.
"క్షణికావేశంలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాను. చాలా పొరపాటు జరిగిపోయింది. నేను అలా మాట్లాడి ఉండకూడదు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆటలు.. జాతి, రంగు, మతంతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేస్తాయి" అని వకార్ ట్వీట్ చేశాడు.
ఆదివారం(అక్టోబరు 24) జరిగిన మ్యాచ్‌లో డ్రింక్స్ విరామ సమయంలో మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. "భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ బ్యాటింగ్ కంటే అతను అంతమంది హిందువుల ముందు నమాజ్ చేయడం నాకెంతో నచ్చింది" అని వ్యాఖ్యానించాడు. దీంతో అతనిపై మాజీ క్రికెటర్లు సహా అభిమానులు విమర్శలు గుప్పించారు.
'అలా మాట్లాడటం సరికాదు'
అంతకుముందు వకార్ (Waqar Younis comment) వ్యాఖ్యలను ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తప్పుపట్టాడు. క్షమాపణలు చెప్పాలని కోరాడు.
"వకార్ లాంటి స్థాయి గల వ్యక్తి అలా మాట్లాడడం నిరాశ కలిగించింది. మనలో చాలా మందిమి అలాంటి విషయాలు ఆటలో రాకుండా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. ఆట గురించే మాట్లాడతాం. క్రికెట్ రాయబారులుగా క్రికెటర్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. వకార్ క్షమాపణలు చెబుతాడని అనుకుంటున్నా. మనం క్రికెట్ ప్రపంచాన్ని ఏకం చేయాలి. మత ప్రాతిపదికన విభజించకూడదు" అని అన్నాడు.
భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం వకార్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గంగూలీకి మరోసారి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ