అధిక పనిభారం కారణంగానే ఆల్‌రౌండర్లు రాలేకపోతున్నారని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ భారత జట్టులో మేటి ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. ‘
"ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమైన విషయం. కపిల్‌దేవ్ లాంటి దిగ్గజాలు అటు వికెట్లు తీస్తూ ఇటు పరుగులు చేసేవారు. టీమ్‌ఇండియాకు కపిల్ సరైన మ్యాచ్ విన్నర్. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిభారం పెరగడం వల్ల అలాంటి నిఖార్సైన ఆల్‌రౌండర్‌ను తయారు చేయడం కష్టంగా మారింది. కొంతమంది ఆటగాళ్లు ఇలా వచ్చి అలా మెరిశారు. వాళ్లు రెండు నైపుణ్యాల మీదా ఎంతో దృష్టిసారిస్తున్నారు. కానీ, విరామం లేకుండా టీమ్‌ఇండియా మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లాడటం వల్ల పనిభారం పెరుగుతుంది. దాంతో చివరికి అది వాళ్లకు కష్టమవుతుంది" అని హార్దిక్ పాండ్యా పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు వీవీఎస్.
"అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే శక్తి సామర్థ్యాలు కలిగిన ఓ ఆటగాడు అనుకోకుండా గాయంబారిన పడ్డాడు. దాంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్.. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. కానీ, ఎవరినీ దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌తో పోల్చకూడదు. ఎందుకంటే కపిల్ ఒక్కడే. ధోనీ, గావస్కర్ లాంటి ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరు మాత్రమే ఉంటారు. ఒకవేళ ఎవరినైనా ఇతరులతో పోలిస్తే ఆ ఆటగాడిపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఇక చివరగా ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌పంత్‌ను ఆడించాలని వీవీఎస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్‌లో పంత్‌నే ఎంపిక చేయాలన్నాడు. ఇటీవలి కాలంలో అతడు బాగా మెరుగయ్యాడని, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గానూ మిడిల్ ఆర్డర్‌లో పనికొస్తాడని చెప్పాడు. ఈ రెండు కారణాలతో పంత్.. ఎలాంటి జట్టుపైన అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్‌ను విజయతీరాలకు చేరుస్తాడని మాజీ బ్యాట్స్‌మన్ అభిప్రాయపడ్డాడు.