టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ కూడా కొట్టక చాలా మాటలు పడ్డాడు కోహ్లీ. సర్వత్రా విమర్శలు.. ఉచిత సలహాలు.. జట్టుకు భారం అనే మాటలు.. ఇలా మానసికంగా వేదనను అనుభవించాడు. అలా అని అస్సలు బ్యాటింగ్ చేయలేదా? అంటే.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కన్నా మంచి ఇన్నింగ్స్‌లే ఆడాడు. కానీ 'పరుగుల రారాజు' స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడని అపవాదు మూటగట్టుకున్నాడు. ఇదంతా గతం. ఇప్పుడు కోహ్లీ ఏంటి? వరల్డ్ కప్ ఆట పరిస్థితి ఏంటి? అనేదే విషయం. ఎందుకంటే ఆసియా కప్‌లో ఆఫ్గానిస్థాన్‌పై సెంచరీతో (కెరీర్‌లో తొలి సెంచరీ) కింగ్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
మన లక్ష్యం ప్రపంచకప్.. 'ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ మన లక్ష్యం కావాలి. అందుకోసం జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఓడిన మ్యాచ్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి' ఈ మాటలు అన్నది విరాట్ కోహ్లీ.. గత ఆసియా కప్‌లో సూపర్-4కే పరిమితమై భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఆటగాళ్లపై పడకుండా ధైర్యం నూరిపోస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలా మాట్లాడటానికి ఆత్మవిశ్వాసం ప్రధాన కారణం. మూడో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు వెన్నెముకలా నిలబడగల సత్తా విరాట్ సొంతం. అందుకే ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ కీలకంగా మారతాడని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కెప్టెన్సీ వదిలేసినప్పటి నుంచి.. గత మెగా టోర్నీలో కెప్టెన్సీ ఒత్తిడితో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన విరాట్ కోహ్లీ.. అప్పుడే జట్టు పగ్గాలను వదిలేశాడు. ఇప్పుడు బ్యాటర్‌గా స్వేచ్ఛగా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుత సంవత్సరంలో టీ20 గణాంకాలను పరిశీలిస్తే.. 14 మ్యాచుల్లో 485 పరుగులు చేశాడు. అందులో సెంచరీతోపాటు నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్ 139కిపైనే ఉంది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే.. ఎంతటి భీకర ప్రత్యర్థి అయినా సరే ఒళ్లు దగ్గరపెట్టుకొని బౌలింగ్ వేయాల్సిందే. దీనింతటికి అనుష్క శర్మనే కారణమని ఓ సందర్భంలో విరాట్ వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి విమర్శలపాలవుతున్న సమయంలో మద్దతుగా నిలిచి మానసిక స్థైర్యం కల్పించిందని వివరించాడు.
ఎవరూ ఇలా కామెంట్ చేయలేరేమో.. మూడేళ్లలో సెంచరీ చేయకపోవడం తప్ప.. అన్ని విధాలుగా విరాట్ రాణించాడు. అర్ధశతకాలు బాదాడు. కానీ అఫ్గాన్‌పై శతకం చేసే దాకా.. విరాట్ కోహ్లీపై వచ్చిన విమర్శలు తీవ్ర ప్రభావం చూపాయి. తన క్రికెట్ కెరీర్ 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను బట్టి అది అర్థమవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఒకటి రెండేళ్లు మాత్రమే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత 'కింగ్' కోహ్లీగా మారిన సీనియర్ బ్యాటర్.. ఒకానొక దశలో సచిన్ వంద సెంచరీల రికార్డును చెరిపేస్తాడని అంతా భావించారు.
ప్రస్తుతం 33 ఏళ్ల విరాట్ మరో నాలుగైదేళ్లు మాత్రమే క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పటికి 71 శతకాలను చేశాడు. రికీ పాంటింగ్ సరసన చేరిన విరాట్.. మరో 29 సెంచరీలు చేయాలంటే ఇంకాస్త శ్రమించాల్సిందే. అదే గత మూడేళ్లలో కనీసం ఓ పది కొట్టుంటే అలవోకగా సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలో విరాట్ చేసిన వ్యాఖ్యలివీ..
"నన్ను ఆదరించే, ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్నా కూడా నేను ఒంటరివాడిగా ఫీలైన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురైందని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇది చాలా కఠినమైన సమస్య. మనం అన్ని సమయాల్లో బలంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు అది మిమ్మల్ని బాధిస్తుంది. అథ్లెట్లు విశ్రాంతి తీసుకోవడం, ఆటల ఒత్తిడి నుంచి కోలుకోని కోర్ సెల్ఫ్‌తో తిరిగి కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. కుటుంబం అండగా నిలవడం ఎంతో బలాన్ని ఇస్తుంది"
- 14 ఏళ్ల కెరీర్ పూర్తైన సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యలు
ఏ మంత్రం పని చేసిందో?.. సీనియర్లు చెప్పిన సూచనలు పని చేశాయో.. లేదా సతీమణి అనుష్క శర్మ ఉపదేశమో కానీ నెల రోజులపాటు ఆటకు దూరంగా ఉండిపోయాడు. తనకిష్టమైన ప్రదేశాలను చుట్టివచ్చాడు. ''పడిన చోటే నిలబడాలి.. పోయిన చోటే దక్కించుకోవాలి''.. అనే మాటలను నిజం చేస్తూ గత ఆసియా కప్ నుంచి సూపర్ 'ఫామ్'లోకి దూసుకొచ్చాడు. అప్పుడే అఫ్గానిస్థాన్ మీద శతకం బాదాడు. ఐదు మ్యాచుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలతో 276 పరుగులు (సగటు 92) సాధించాడు. ఆసియా కప్‌లో రెండో టాప్ స్కోరర్ కావడం విశేషం.
'టీ20ల్లో తొలి శతకం సాధించడం నాకే ఆశ్చర్యంగా ఉంది'.. ఇవి అఫ్గాన్ మీద భారీ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు.. ఏ ఫార్మాట్‌లోనైనా సెంచరీ కోసం దాదాపు 1,000 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికాడు. ''నాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్న అనుష్కకు, నా కుమార్తె వామికకు ఈ సెంచరీని అంకితమిస్తున్నా''.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించిన అనంతరం విరాట్ కోహ్లీ.
ఎప్పుడూ ఫిట్.. 'నా ఫిట్‌నెస్‌లో అత్యంత ముఖ్యమైనవి, తక్కువగా చేసేవి ఇప్పుడు రొటీన్ అయ్యాయి. అవే ఫోమ్ రోలింగ్, ట్రిగ్గర్ పాయింట్ రిలీజ్. ఈ రెండూ గేమ్‌ఛేంజర్స్'. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా టీ20 ప్రపంచకప్‌ను అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఈసారైనా అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతమున్న ఆటగాళ్లలో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్ కూడా కోహ్లీనే. మైదానంలో ఇప్పటికీ ఎంతో చురుగ్గా కదులుతూ సహచరులకు రోల్‌మోడల్‌గా ఉన్నాడు. తన ఫిట్‌నెస్ మంత్రం ఏంటో కూడా చెప్పిన కోహ్లీ.. పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టేందుకు సిద్ధమైపోయాడు. మరోసారి పొట్టి ప్రపంచకప్ కల తీరాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: శ్రీలంకతో ఆసియాకప్ ఫైనల్.. మన అమ్మాయిలకు ఎదురుందా?