Virat Kohli Rohith Sharma Interview : దాదాపు మూడేళ్లుగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న 71వ సెంచరీని విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇరగదీసి.. 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరిసారిగా 2019 నవంబర్‌లో 70వ సెంచరీ చేశాడు కోహ్లీ.
అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. విరాట్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదట్లో రోహిత్ స్వచ్ఛమైన హిందీలో తనను ప్రశ్న అడగటంపై విరాట్ షాక్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ రోహిత్.. తనతో ఇంత బాగా హిందీలో మాట్లాడుతున్నాడని అన్నాడు. ఇక తాజాగా చేసిన సెంచరీ.. తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని కోహ్లీ చెప్పాడు. తాను కూల్‌గా, రిలాక్స్‌గా ఉండి పరుగులు చేయడంలో రోహిత్ తనకు సహాయం చేశాడని పొగడ్తలతో ముంచెత్తాడు.
"ఇన్ని రోజుల తర్వాత టీ20 ఫార్మాట్‌లో నేను సెంచరీ చేస్తానని ఊహించలేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ మ్యాచ్‌కు ఎలాంటి వైఖరితో బరిలోకి దిగాలో మేము డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నాం. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మాకు చాలా ముఖ్యమైనది. నాకౌట్ స్టేజ్‌లు, ఒత్తిడి మాకు అలవాటే. కానీ మా లక్ష్యమేంటో మాకు తెలుసు. ఆస్ట్రేలియాలో జరగబోయే వరల్డ్‌కప్ కోసం మేము సన్నద్ధమవుతున్నాం. ఓడిన మ్యాచ్‌ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం" అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ఫామ్ కోల్పోయిన సమయంలో టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించిందని కోహ్లీ తెలిపాడు. చాలా కాలం తర్వాత.. తాను అప్పట్లో ఎలా ఆడేవాడినో అలా ఆడగలిగానని, ఈ ఫామ్ కొనసాగిస్తానని అన్నాడు. రాబోయే వరల్డ్‌కప్‌లో తాను ఇలా ఆడాలని ముందు నుంచే అనుకున్నట్లు చెప్పాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా బాగుందన్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు అతడు ఫామ్‌లోకి రావడం చాలా ముఖ్యమని విరాట్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు విరాట్ ఖాతాలో ఉన్నాయి. మొత్తంగా 71 సెంచరీలతో రికీ పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి: 'కోహ్లీ ఓపెనర్ అయితే.. నేను ఖాళీగా కూర్చోవాలా?'
కెరీర్లో తొలిసారి బౌలింగ్ చేసిన దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్!