Virat Kohli Removed from ODI Captain: విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది ఏమాత్రం రుచించని విషయమే. ఏ ఫార్మాట్లో అయినా కెప్టెన్సీ తనకు తానుగా వదులుకోవాలి తప్ప, అతడిపై వేటు వేసే రోజు ఇంత త్వరగా వస్తుందని వాళ్లు ఊహించి ఉండరు. బ్యాట్స్‌మెన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన్నాళ్లూ భారత క్రికెట్లో తనకు ఎదురే లేకుండా చేసుకున్నాడు విరాట్. కానీ అతడి ఫామ్ దెబ్బ తినగానే పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. టీ20 కెప్టెన్సీని తప్పనిసరి పరిస్థితుల్లో తనే వదులుకున్నాడు. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ ఊడింది. దీన్ని అవమానంగా భావించి కుంగిపోతాడా, లేక ఒక అవకాశంగా మలుచుకుని తిరిగి బ్యాట్స్‌మన్‌గా పూర్వపు స్థాయిని అందుకుంటాడా అన్నది ఆసక్తికరం.
ఏమాత్రం ఎదురులేకుండా..
Kohli test captain: అది 2014 ఆస్ట్రేలియా పర్యటన. మూడు టెస్టుల్లో మూడు శతకాలు సహా దాదాపు 500 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. తొలి టెస్టులో కెప్టెన్ ధోనీ అందుబాటులో లేకుంటే తాత్కాలిక సారథ్య బాధ్యతలు అందుకుని, జట్టును సమర్థంగా నడిపించాడు. బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ జోరు, కెప్టెన్‌గా అతడి పనితనం చూశాక ధోనీ తన నిష్క్రమణకు సమయం ఆసన్నమైందనుకున్నాడు. ధోనీ ఇంకొన్నేళ్లు ఆటగాడిగా, కెప్టెన్‌గా కొనసాగుతాడని అంతా అనుకున్నారు కానీ.. విరాట్ దూకుడు చూశాక కెప్టెన్సీని అతడికిచ్చేసి టెస్టులకు టాటా చెప్పేశాడు. కొన్నేళ్ల తర్వాత వన్డే, టీ20 పగ్గాలు కూడా విరాట్‌కే అప్పగించేసి కేవలం ఆటగాడిగా కొనసాగాడు. విరాట్ అసమాన బ్యాటింగ్, జట్టును నడిపించడంలో అతడి ఉత్సాహం చూశాక.. ధోనీ అలా సారథ్య బాధ్యతలను వదులుకోవడం ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. తన అసాధారణ బ్యాటింగ్ సామర్థ్యంతో మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వ బాధ్యతలు తనను వరించేలా చేసుకున్నాడు విరాట్. ఎప్పుడూ కెప్టెన్సీని భారంలా భావించలేదతను. నాయకత్వ బాధ్యతలందుకున్నాక బ్యాట్స్‌మెన్‌గా మరింత మెరుగుపడటం వల్ల.. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్‌గా అతడికి పేరొచ్చింది. జట్టు కూడా నిలకడగా విజయాలు సాధించడం వల్ల అతడికి ఏ రకంగానూ ఎదురు లేకపోయింది. అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజం కోచ్ అయ్యాక కోహ్లీతో విభేదాలొస్తే అతను తప్పుకోవాల్సి వచ్చింది కానీ.. కోహ్లీకి ఏ రకమైన ఇబ్బందీ రాలేదు. క్రికెట్ సలహా కమిటీ సభ్యుడైన గంగూలీకి.. రవిశాస్త్రి పట్ల ఏమాత్రం సానుకూల అభిప్రాయం లేకపోయినా.. కోహ్లీ మెచ్చాడు కాబట్టి అతడినే కోచ్‌గా చేయాల్సి వచ్చింది. భారత క్రికెట్లో కోహ్లీ ఆధిపత్యానికి ఇవి సూచికలు.
ఎందుకిలా?
Kohli captaincy record: కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. 66 టెస్టుల్లో 39 విజయాలతో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే కోహ్లీ నాయకత్వ ఘనతలు ఇంకా మెరుగే. అతను 95 వన్డేల్లో నాయకత్వం వహిస్తే 65 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గింది. 27 మ్యాచ్‌లు ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా.. 2 వన్డేల్లో ఫలితం రాలేదు. గెలుపు శాతం 70.43. 90కి పైగా. టెస్టులకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో పాంటింగ్ (76.14 శాతం), క్రానె (73.70 శాతం)ల తర్వాత అత్యుత్తమ రికార్డు విరాట్‌దే. టీ20 విషయానికొస్తే 50 మ్యాచ్‌ల్లో 30 విజయాలు, 64.58 గెలుపు శాతంతో మంచి స్థాయిలోనే ఉన్నాడు. అయితే మ్యాచ్‌లు, సిరీస్‌లు ఎన్ని గెలిచినా ఐసీసీ ట్రోఫీ ఒక్కటీ సాధించకపోవడం కోహ్లీకి పెద్ద ప్రతికూలత. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా బెంగళూరుకు ఒక్క కప్పు కూడా అందించలేకపోవడం, మరోవైపు రోహిత్ సారథ్యంలో ముంబయి అయిదుసార్లు విజేతగా నిలవడం వల్ల కోహ్లి నాయకత్వ లక్షణాలను ప్రశ్నార్థకం చేసింది.
అందుకే వేటు తప్పలేదా?
Virat kohli captaincy removed: అయితే అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌గా భీకర ఫామ్‌తో దూసుకెళ్లినంత కాలం కోహ్లీని కెప్టెన్‌గానూ ఎవరూ ప్రశ్నించలేకపోయారు. కానీ గత రెండేళ్లలో ఫామ్ దెబ్బ తినడం వల్ల.. విరాట్ కెప్టెన్సీపై విమర్శలు, రోహిత్‌కు కనీసం టీ20ల్లో అయినా సారథ్యం అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. పరిస్థితిని అర్థం చేసుకుని టీ20 ప్రపంచకప్ అనంతరం ఈ ఫార్మాట్లో సారథ్యం నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2023 ప్రపంచకప్ వరకు వన్డేల్లో సారథిగా కొనసాగాలని అతను ఆశించి ఉండొచ్చు. అయితే పొట్టి కప్పును సాధించి టీ20 సారథ్యానికి వీడ్కోలు పలికితే వన్డే కెప్టెన్సీకి వెంటనే ముప్పు రాకపోయేదేమో. కానీ ఆ టోర్నీలో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. దీనికి తోడు పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను పెట్టే సంప్రదాయం భారత క్రికెట్లో ఎప్పుడూ లేదు. వన్డేలు, టీ20ల్లో దాదాపు ఒకే జట్లు బరిలోకి దిగుతుంటాయి. అలాంటపుడు ఫార్మాట్‌కో కెప్టెన్ ఉండటం ఏ రకంగా చూసినా ఆమోదయోగ్యంగా అనిపించదు. అందుకే సెలక్టర్లు ఇప్పుడు కోహ్లీపై వేటు వేయక తప్పలేదు. టీ20 సారథ్యంతో పాటే వన్డే కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకుని ఉండాల్సిందని, అలా చేస్తే ఇప్పుడు అతణ్ని సెలక్టర్లు తప్పించాల్సిన పరిస్థితి తలెత్తేది కాదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
ఎలా తీసుకుంటాడు?
Bcci kohli rohit: వన్డే కెప్టెన్‌గా తనపై వేటు వేయడాన్ని కోహ్లీ ఎలా తీసుకుంటాడు..? ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న ఇదే. సెలక్టర్ల నిర్ణయం అతడి అహాన్ని దెబ్బ తీస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్నొక అవమానం లాగా భావిస్తే కోహ్లీకి అది చేటు చేసేదే. ఇలాంటి అనుభవాలను ఎంతోమంది దిగ్గజాలు ఎదుర్కొన్న విషయాన్ని అతను గ్రహించాలి. కెప్టెన్‌గా వ్యవహరించింది కొంత కాలమే అయినా.. సచిన్ ఇబ్బందికర రీతిలోనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాకు అప్రతిహత విజయాలందించిన పాంటింగ్ సైతం వేటును ఎదుర్కోక తప్పలేదు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి కోహ్లీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కోహ్లీ ప్రస్తుత పరిస్థితికి కారణం బ్యాటింగ్ జోరు తగ్గడమే. దాన్ని ఇప్పుడు గాడిన పెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యం. తనకు సారథ్య బాధ్యతలిచ్చేసి ఏ భేషజాలు లేకుండా ఒక సభ్యుడిగా జట్టులో కొనసాగుతూ, తనకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ ధోని నుంచి కోహ్లి స్ఫూర్తి పొందాలి. బ్యాట్స్‌మెన్‌గా, సీనియర్ ఆటగాడిగా రోహిత్‌కు సహకరించాలి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, ఆ తర్వాతి ఏడాది వన్డే ప్రపంచకప్ సాధన దిశగా అతడితో కలిసి జట్టును ముందుకు నడిపించాలి.
ఇదీ చూడండి: Virat Kohli: కోహ్లీకి షాక్.. కెప్టెన్సీ తొలగించడానికి కారణమిదే!