Virat Kohli ODI Ranking 2023 : భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో అతడి స్థానం దిగజారింది. ఈ మేరకు ఐర్లాండ్ యువ ప్లేయర్ హ్యారీ టెక్టర్ 722 రేటింగ్ పాయింట్లతో.. కోహ్లీ (719 రేటింగ్ పాయింట్లు)ని, దక్షిణాఫ్రికా జట్టుకు ఆటగాడు క్వింటన్ డికాక్ (718 రేటింగ్ పాయింట్లు)ను అధిగమించాడు. వన్డేల్లో టాప్ 10 బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
harry tector icc ranking : ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఏడో స్థానానికి ఎగబాకాడు టెక్టర్. కోహ్లీ, డికాక్ వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, లిస్ట్ టాపర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (886 రేటింగ్ పాయింట్స్) ఉన్నాడు. టాప్ 10 వన్డే బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఉన్నారు. గిల్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ పదో స్థానంలో ఉన్నాడు.
అయితే, కోహ్లీ టెక్టర్ మధ్య మూడు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత.. వెస్ట్ ఇండీస్‌తో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఈ మూడు వన్డేల్లో కోహ్లీ ప్రదర్శన బాగుంటే.. ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశాలున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా కప్ కూడా కోహ్లీకి మంచి అవకాశమే. అయితే, ఈ ఆసియా కప్ విషయంలో సందిగ్ధత నెలకొంది. టోర్నీ జరిగే వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ టోర్నీని పూర్తిగా రద్దు చేసే ఛాన్స్ కూడా ఉంది.
అందరి దృష్టి కోహ్లీ పైనే..
ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ ఆరుగురు ప్లేయర్లలో కోహ్లీ (438) ఆరో స్థానంలో ఉన్నాడు. మరో ఆర్సీబీ ప్లేయర్ డుప్లెసిస్ (631 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరు జట్టు తలపడుతోంది. ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయి హైదరాబాద్ నామమాత్రపు మ్యాచ్ అడుతుంటే.. బెంగళూరు మాత్రం చావో రేవో తేల్చుకుంటోంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. గురువారం విరాట్ కోహ్లీ ఆడనుండటం హైదరాబాద్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో లఖ్‌నవూతో సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో కోహ్లీ లేకపోయినా.. అభిమానులు పెద్ద ఎత్తున అతనికి మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ఆసాంతం కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారం కోహ్లీ స్వయంగా ఉప్పల్‌లో కనిపిస్తుండటం వల్ల అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.