Ian Chappel on Kohli captaincy: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ప్రశంసించాడు. అతడు గంగూలీ, ధోనీ నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడని అన్నాడు. అందుకే ఏడేళ్ల పాటు భారత జట్టును సమర్థవంతంగా నడిపించాడని కొనియాడాడు.
"కోహ్లీ విజయవంతమైన కెప్టెన్. అతడు మాజీ సారథి మహీ నుంచి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆందోళన కలిగింది. అతడికున్న అత్యుత్సాహం నాయకుడిగా తన నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా అనిపించింది. అయితే, కెప్టెన్‌గా కోహ్లీ బాగా రాణించి జట్టును విజయవంతంగా నడిపించాడు. తన అత్యుత్సాహాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. కానీ, టీమ్‌ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతకుముందు ఏ కెప్టెన్ చేయలేని విధంగా.. వైస్ కెప్టెన్‌గా అజింక్య రహానెతో కలిసి టీమ్‌ను విదేశాల్లో విజయం రాణించేలా చేశాడు. 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియా, 2021లో ఇంగ్లాండ్ పర్యటన.. కోహ్లీ కెరీర్‌లో అత్యుత్తమ విజయాలు. స్వదేశంలో భారత్ ఎదురులేనిదే. అతడు దాదా, ధోనీల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల పాటు జట్టును సమర్థవంతంగా నడిపించాడు. అయితే, ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ కోల్పోవడమే అతడికి తీవ్ర నిరాశ కలిగించేది. తొలి టెస్టులో విజయం సాధించినా సిరీస్ కోల్పోవడం బాధాకరం. అతడు ఆటగాళ్లలో టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. విరాట్‌కు టెస్టుల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. దీనికోసం ఎంతో శ్రమించాడు. రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిన విధానం కూడా అద్భుతం. యువ ఆటగాడికి అతడిచ్చిన మద్దతు ఎంతో గొప్ప విషయం" అని ఛాపెల్ పేర్కొన్నాడు. కాగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఉద్దేశిస్తూ.. "అతడు గొప్ప బ్యాటర్ అయినప్పటికీ సారథిగా విఫలమయ్యాడు. జట్టును తీర్చదిద్దలేకపోయాడు" అని అన్నాడు.
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ అనంతరం విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడు అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నట్లైంది. కాగా, టీమ్‌ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది.
ఇదీ చదవండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
IPL 2022: స్వదేశంలోనే ఐపీఎల్.. ఆ రెండు రాష్ట్రాల్లో మ్యాచ్‌లు!