Virat Kohli: ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత జట్టుకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు. జూమ్ కాల్ ద్వారా వారితో మాట్లాడిన విరాట్.. ఫైనల్ గురించి కుర్రాళ్లతో చర్చించినట్లు సమాచారం. "విరాట్ భాయ్‌తో మాట్లాడడం గొప్పగా అనిపించింది. క్రికెట్ గురించే కాదు జీవితం గురించి ఆయన చెప్పిన కీలక విషయాలు ఎంతో ఉపయోగపడతాయి" అని కెప్టెన్ యశ్ ధుల్ చెప్పాడు. ప్రపంచకప్ ఫైనల్ ముంగిట దిగ్గజ ఆటగాడు విలువైన సలహాలు ఇచ్చాడని స్పిన్నర్ కౌశల్ తంబె పేర్కొన్నాడు. 2008లో కౌలాలంపుర్‌లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
'ఆ శతకం ఓ గర్వకారణం'
అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా నిలవడం తనకెంతో గర్వకారణమని యశ్ ధుల్ అన్నాడు. గతంలో కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్ (2012) ఆ ఘనత సాధించారు. ప్రస్తుతం విండీస్‌లో జరుగుతున్న ఈ కుర్రాళ్ల ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన యువ భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. "రషీద్, నేను చివరి వరకూ బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఆ ప్రణాళిక ఫలితాన్నిచ్చింది. నిలకడగా ఆడి ఇన్నింగ్స్ నిలబెట్టాలనుకున్నాం. మరీ ఎక్కువ షాట్లు ఆడకుండా 40వ ఓవర్ దాటేంత వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. రషీద్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు. మా జోడీ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మేం ఇద్దరం కలిస్తే మెరుగ్గా రాణిస్తామని తెలుసు. ఇప్పుడదే జరిగింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలవడం నాకు గర్వకారణం" అని యశ్ తెలిపాడు.
ఇవీ చూడండి:
కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు: శార్దుల్ ఠాకుర్
Under 19 World Cup: ఆస్ట్రేలియాపై ఘన విజయం- ఎనిమిదోసారి ఫైనల్‌కు భారత్