టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో మనందరికీ తెలుసు. ప్రత్యర్థులను కవ్వించేందుకూ సిద్ధమవుతాడు. అలాగే తన అసహనాన్ని వ్యక్తం చేయడంలో ఏమాత్రం సందేహించడు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ చోటు చేసుకొంది.
చివరి టెస్టు రెండో రోజు ఆటను (శుక్రవారం) ముగించడానికి ఇంకాస్త సమయం ఉంది. అయితే అప్పటికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమై ఐదు ఓవర్లు జరిగాయి. ఆరో ఓవర్‌ను వేస్తుండగా.. చివరి బంతికి ముందు బంగ్లా ఓపెనర్ షాంటో (5) షూస్ సాక్స్‌లను సరిచేసుకొనేందుకు బౌలింగ్‌ను ఆపాడు. అప్పటికే వెలుతురు మందగిస్తుండటంతో ఇంకొన్ని ఓవర్లు వేయాలనే టీమ్‌ఇండియా ఆలోచనకు బ్రేక్ పడేలా కనిపించింది. అయితే షాంటో మాత్రం అలానే సమయం వృథా చేసేందుకు చూస్తుండటంతో విరాట్ కోహ్లీ.. అసహనం వ్యక్తం చేశాడు. "దుస్తులు కూడా విప్పేయ్" అని చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఓవర్ పూర్తైన తర్వాత వెలుతురు సరిగా లేదనే కారణంతో అంపైర్లు ఆటను ముగించారు.
రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 227 పరుగులు చేసింది. దీంతో భారత్ 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం మూడో రోజు జరుగుతోన్న టెస్టులో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆడుతోంది.