T20 World Cup IND Vs SA: టీ20 ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా.. నేడు సఫారీలతో పోరుకు సిద్ధమైంది. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కింగ్ కోహ్లీ పైనే. దాయాది పాక్‌పై.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో పలు రికార్డులపై కన్నేశాడు ఈ పరుగుల వీరుడు.
- టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కోహ్లీ మొత్తం 989 పరుగులు చేశాడు. ఇంకో 28 పరుగులు చేస్తే ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్దనే 1016 పరుగులతో ఈ జాబితాలో ముందున్నాడు.
- మరో 11 పరుగులు చేస్తే .. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు.
ఇక విరాట్.. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడి.. 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ శతకాలున్నాయి.
నెట్స్‌లో 'బ్లైండ్ డ్రిల్స్'తో చమటోడ్చిన కార్తీక్
మరోవైపు, భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ నెట్స్‌లో బాగా కష్టపడుతున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్‌లో బ్యాటర్ లీడ్స్ స్టంపింగ్‌ను మిస్‌చేసిన విషయం తెలిసిందే. మరోసారి అటువంటి తప్పు దొర్లకుండా ప్రత్యేకంగా దృష్టిపెట్టి సుదీర్ఘ సమయం ప్రాక్టిస్‌లో గడిపాడు. ముఖ్యంగా వికెట్ల వెనుక రీయాక్షన్ టైమింగ్‌ను మెరుగుపర్చుకొనేందుకు సాధన చేశాడు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, కోచ్ ద్రవిడ్ కార్తీక్ ప్రాక్టిస్‌ను పర్యవేక్షించారు.
కార్తీక్ వికెట్ల వెనక ఉన్న సమయంలో బ్యాటర్లు అడ్డు వస్తే బంతి గమనం సరిగ్గా అర్థం కాదు.. ఆ బంతి బ్యాటర్ దాటిన తర్వాతే కీపర్‌కు కనిపిస్తుంది. అటువంటి సమయంలో చురుగ్గా స్పందించాల్సి ఉంటుంది. ఈ రీయాక్షన్ టైమింగ్‌ను మెరుగుపర్చుకొనేందుకు బంతి గమనం తెలియకుండా రెండు ట్రాఫిక్ కోన్స్‌పై టవల్‌ను అడ్డంగా ఉంచారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బంతిని ఆ టవల్ కింద నుంచి వచ్చేట్లు విసురుతుండగా.. కార్తీక్ దానిని అందుకొనే యత్నం చేశాడు. దీనిని 'బ్లైండ్ డ్రిల్స్'గా పిలుస్తారు. ఆ తర్వాత ఓ కిట్ బ్యాగ్, రబ్బర్ బ్యాట్ కూడా ఉపయోగించి ప్రాక్టిస్ చేశాడు. ఒక బలమైన త్రో అందుకునే సమయంలో కార్తీక్ గాయపడినట్లు ప్రచారం జరిగినా.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాత్రం దాని ప్రస్తావన లేదు.
ఇవీ చదవండి:
ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్.. జింబాబ్వేపై అతికష్టం మీద బంగ్లా విజయం
T20 World Cup: భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం?