KL Rahul on Kohli's agression: భారత టాప్ఆర్డర్ బ్యాటర్ కోహ్లీ పేరు వినగానే అతడి దూకుడు స్వభావం గుర్తొస్తుంది. బ్యాటింగ్ అయినా, కెప్టెన్సీ అయినా.. విరాట్ సహజంగానే దూకుడుగా వ్యవహరిస్తాడు. తనను ఎవరైనా కవ్వించేందుకు ప్రయత్నిస్తే.. నోటితో పాటు బ్యాటుతోనూ గట్టిగా సమాధానం చెబుతాడు. తన టీమ్ మెంబర్లను కవ్వించినా.. తనదైన శైలిలో స్పందిస్తాడు. అయితే, కోహ్లీకి ఉన్న కోపమే తన బెస్ట్ ఫ్రెండ్ అని అతడి సహచరుడు కేఎల్ రాహుల్ అంటున్నాడు. విరాట్ లోపల ఒక ఫైర్ ఉందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ లాంటి ఆటలు ఆడినప్పుడు ఆ మాత్రం దూకుడు ఉండాలని అభిప్రాయపడ్డాడు. తాను కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
Kohli anger kl rahul: "నేను పెరిగే సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలని మాత్రం అనుకోలేదు. విరాట్ కూడా ఇదే చెప్పాడు. అతడి కోపమే విరాట్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆ కోపాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. సరైన ఫలితం వచ్చేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ లేకపోతే క్రికెట్ ఆడలేం. జీవితంలో మరే ఇతర పని చేయలేం" అని ఓ ప్రముఖ యూట్యూబ్ షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు.
KL Rahul name story: మరోవైపు, తనకు పేరు పెట్టడం వెనక ఉన్న ఆసక్తికర కథను రాహుల్ వెల్లడించాడు. 'షారుక్ ఖాన్‌కు మా అమ్మ వీరాభిమాని. సినిమాల్లో షారుక్ పాత్రల పేర్లు ఎక్కువగా రాహుల్ అనే ఉండేదని.. అందుకే నాకు ఆ పేరు పెట్టానని మా అమ్మ చెప్పేది. నేను ఇన్నేళ్లు ఇదే నమ్మాను. అయితే, షారుక్ 1994లో తొలిసారి రాహుల్ పాత్రలో నటించాడు. కానీ నేను 1992లో పుట్టాను. ఈ విషయం స్నేహితులు చెప్పేసరికి షాక్ అయ్యాను. మా అమ్మ నాకు అబద్ధం చెబుతూ వచ్చింది(నవ్వుతూ). మా నాన్నేమో మరో కథ చెబుతాడు. కామెంట్రీ సందర్భంగా సునీల్ గావస్కర్ తన కొడుకు పేరు రాహుల్ అని చెప్పాడని మా నాన్న గుర్తు పెట్టుకున్నాడు. గావస్కర్ ఫ్యాన్ కాబట్టి రాహుల్ అని పేరు పెట్టానని చెప్పాడు. నిజానికి గావస్కర్ కొడుకు పేరు రోహన్' అని రాహుల్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: 'మేం కప్పు గెలిస్తే డివిలియర్స్నే గుర్తు చేసుకుంటా'