Vijay Hazare Trophy Tamilnadu: విజయ్‌హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. మొదట తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ జగదీశన్ (102; 101 బంతుల్లో 9×4, 1×6) సెంచరీ సాధించాడు సాయికిశోర్ (61)తో కలిసి అతడు రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ (44; 37 బంతుల్లో 4×4, 2×6)తో పాటు 7వ స్థానంలో వచ్చిన షారుక్‌ఖాన్ (79; 39 బంతుల్లో 7×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. కర్ణాటక బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ ప్రవీణ్ దూబె (3/67), ప్రసిద్ధ్ కృష్ణ (2/57) రాణించారు. ఛేదనలో సిలంబరాశన్ (4/36), వాషింగ్టన్ సుందర్ (3/43) విజృంభించడం వల్ల కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. శ్రీనివాస్ శరత్ (43) టాప్ స్కోరర్.
యూపీకి షాకిచ్చి..
Vijay Hazare Trophy Himachal Pradesh: మరో క్వార్టర్స్‌లో బలమైన ఉత్తర్‌ప్రదేశ్ మీద హిమాచల్‌ప్రదేశ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 207 పరుగులే చేయగలిగింది. హిమాచల్ బౌలర్ల ధాటికి 103/5తో కష్టాల్లో పడిన యూపీని రింకు సింగ్ (76), భువనేశ్వర్ కుమార్ (46) ఆదుకున్నారు. హిమాచల్ బౌలర్లలో వినయ్ గలేతియా (3/19), సిద్ధార్థ్ శర్మ (2/27), పంకజ్ జస్వాల్ (2/43) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ప్రశాంత్ చోప్రా (99; 141 బంతుల్లో 10×4, 2×6), నిఖల్ గాంగ్టా (58; 59 బంతుల్లో 5×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.
బుధవారం జరిగే క్వార్టర్స్‌లో సౌరాష్ట్రతో విదర్భ.. సర్వీసెస్‌తో కేరళ తలపడనున్నాయి.