Venkatapathy Raju Exclusive With Etv Bharat : IPL మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరగబోయే ఈ వేలంలో 333 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏయే ఫ్రాంచైజీ ఎలాంటి స్ట్రాటజీలతో ముందుకెళ్తుంది. ఏ ఆటగాడిపై ఎంత వెచ్చిస్తుందనే అంశాలు సర్వత్రా ఆసక్తిగా మారాయి. మరి ఈ మినీ వేలంపై మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఎక్స్పర్ట్, జియో సినిమా కామెంటేటర్ వెంకటపతి రాజుతో ఈటీవీ భారత్ ప్రతినిధి బి.వీరవెంకటకుమార్ ముఖాముఖి.
మినీ వేలంలో కీలక ప్లేయర్లు ఎవరు? ఫ్రాంఛైజీలు ఎవరికి కోసం ఆసక్తిగా ఉన్నాయి?
ఐపీఎల్ స్టార్ట్ ఆయిపోయి 15ఏళ్లు అయింది. మనం మినీ వేలం అంటున్నాం. కానీ దీన్ని మెగా వేలంలా భావించవచ్చు. ఈ ఏడాది ఫ్రాంఛైజీ యజమానులు అందరూ కూడా ఎవరైతే భారత కండీషన్స్‌కు సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారో వారిని రిలీజ్ చేశారు. అందరి దగ్గరా డబ్బు భారీగానే ఉంది. వేలం చాలా ఆసక్తిగా ఉండబోతుంది. ఆస్ట్రేలియన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఇటీవల వైట్‌బాల్ క్రికెట్లో మంచిగా ఆటతీరు కనబరుస్తున్నారు. నా దృష్టిలో మాత్రం మనకు కావల్సింది ఇండియన్ ఆల్‌రౌండర్స్. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకునే వారిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది.
ఈ సంవత్సరం వేలం ఆసక్తికరంగా ఉండబోతుంది. లాస్ట్ టైం సామ్ కర్రన్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఆర్చర్ మీద కూడా ముంబయి ఇండియన్స్ ఎక్కువగా వెచ్చించింది. ఎక్కువగా గాయాలు అయ్యేసరికి వదిలేసింది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌పైనే అందరి దృష్టి ఉంది. మంచి పేస్ ఉంది. రచిన్ రవీంద్ర బ్యాటింగ్ చేయగలడు. మంచి స్పిన్ కూడా చేయగలడు. వీరికి ఐడియల్ ఇండియన్ కండీషన్స్ సరిగ్గా సరిపోతాయి. గతంలో చూసుకుంటే హారీ బ్రూక్ తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు.
ప్రాంఛైజీలు ఎవరిపై ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి?
భారత్ కండీషన్స్‌కు ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ అవసరం. స్టార్క్, రచిన్ రవీంద్రపై ఎక్కువగా ప్రాంఛైజీలు ఆసక్తి చూపెడతాయని భావిస్తున్నాను. శార్దూల్ ఠాకూర్‌ని కూడా తక్కువ అంచనా వేయలేం. గతంలో చెన్నైకు ఆడి మంచి ప్రదర్శన కనబర్చాడు. హర్షల్ పటేల్, హసరంగా, దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ గెరాల్డ్ వీరంతా కీలకంగా మారతారని అనుకుంటున్నా.
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌పై ప్రాంఛైజీలు ఎలాంటి దృష్టి పెట్టాయి. షారుక్‌ఖాన్, కార్తీక్ త్యాగి వంటి ఆటగాళ్లపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి?
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌ను ఎలా ఉపయోగించుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీళ్లందరి ఆటతీరు ఇప్పటికే చూశాం. యంగ్‌స్టర్స్‌ని ఎక్కువగా మ్యానేజ్ చేయాలి. అవకాశాలు విరివిగా వచ్చేలా చూడాలి. ఫినిషర్స్ పాత్రను స్పష్టంగా చెప్పాలి. అప్పుడే వీరంతా మ్యాచ్ విన్నర్స్ అవుతారు. ప్రతి టీమ్‌లో ఏడుగురు భారత్ ఆటగాళ్లు కావాలి. కాబట్టి వేలం చాలా రసవత్తరంగా ఉండబోతుంది.
కెప్టెన్సీ మార్పులు టీమ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపెడతాయని భావిస్తున్నారు?
కెప్టెన్లకు కూడా తగినంత సమయం ఇవ్వాలి. అన్ని టీమ్‌లు చెన్నై సూపర్‌కింగ్స్‌లా ఉండవు. చెన్నైలో ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్‌గా ఉంటుంది. మిగతా జట్లలో అలా కాదు. హార్దిక్ ముంబయికి వచ్చేశాడు. గతకొంత కాలంగా వారి టీమ్ ప్రదర్శన బాగోలేని కారణంగా ఇలా చేసి ఉండొచ్చు. ఇవన్నీ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగానే అనుకోవచ్చు.
ధోనీ తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశాలు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఎక్కువగా ఎవరికి ఉన్నాయి?
రుతురాజ్ గైక్వాడ్, అంజిక్య రహానే వంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధోనీ ఆడుతున్న వరకూ వేరే ఎవరినీ ఊహించుకోవడానికి వీలు లేని పరిస్థితి చెన్నైలో ఉంది. గతంలో వారు చేసిన ప్రయోగాలు కూడా విఫలమవ్వడం మనం చూశాం.
గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే గిల్‌ని కెప్టెన్‌గా నియమించారు. అతని బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం ఉంటుందని అనుకోవచ్చా?
బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం పడుతుండొచ్చనే అనుకుంటున్నాం. అన్ని ఫార్మాట్లలో చక్కగా ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి తగినంత సమయం ఇవ్వాలి. సపోర్ట్ స్టాఫ్ కూడా గిల్‌కు సహకారం అందించాలి. ఇండియన్ ప్లేయర్స్, భవిష్యత్ ఆటగాళ్లు కాబట్టి వారికి తగినంత సమయం ఇచ్చి చూడాలి.
ఎక్కువ డబ్బు ఉన్నా ప్రాంఛైజీలు జట్టు కూర్పు కోసం ఎలాంటి ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి?
మెయిన్ ప్లేయర్లు అయితే అందరి దగ్గరా ఉన్నారు. వాళ్లకు కావల్సింది ఆల్‌రౌండర్స్. వారికి కోసమే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారని ఆశిస్తున్నాం. ఫాస్ట్ అండ్ స్పిన్ ఆల్‌రౌండర్స్ కోసమే ఎక్కువగా వెచ్చిస్తారని అనుకుంటున్నాం.
ఐపీఎల్ ప్రసార హక్కులు తొలిసారి జియో సినిమా దక్కించుకుంది. ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి లభించబోతుంది?
అన్ని భాషల్లో కామెంట్రీ ఇవ్వబోతున్నాం. ప్రత్యక్షప్రసారం అనుభూతి కొత్తగా ఉండబోతుంది. వ్యూవర్‌షిప్ కూడా పెరగబోతుంది. ఫ్యాన్ బేస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ కామెంటేటర్లుగా వెంకటపతిరాజు, హనుమ విహారి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచబోతున్నారు..?
ఇప్పటికే మేము కామెంట్రీ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కండీషన్స్ అన్నీ తెలిసి ఉంటాయి. ఒత్తిడి తట్టుకుని నిలబడే వాళ్లే గేమ్‌లో విజయం సాధిస్తారు. ఆటగాళ్లపై ఒత్తిడి, టీమ్ కాంబినేషన్స్ వంటి మాట్లాడుతూ గేమ్ సాధికారికంగా సాగేలా చూడటం మా పని. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా మేం చూసుకుంటాం. అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే మ్యాచ్‌లు మజా పంచేలా చూస్తాం.
Ishan Kishan Parents Interview : 'అతడితో ఇషాన్‌ను పోల్చొద్దు.. ఏ ప్లేస్‌లోనైనా ఆడగలడు'
అజారుద్దీన్ టు సిరాజ్... టీమ్ఇండియాలో హైదరాబాదీ ఆణి'ముత్యాలు' వీరే!