Under-19 world cup final IND Vs Eng: మరికాసేపట్లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6;30 గంటలకు మ్యాచ్ షురూ కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో మన కుర్రాళ్లు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం..
- 13 ప్రపంచకప్‌లు.. ఏడు ఫైనళ్లు.. నాలుగు సార్లు విజేత.. ఇదీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత ఘనమైన చరిత్ర.
- ప్రస్తుతం జరుగుతున్న 14వ అండర్-19 ప్రపంచకప్‌లోనూ ఫైనల్ చేరింది భారత్.
- భారత్‌కు ఇది ఎనిమిదో ఫైనల్. మరే జట్టు కూడా ఇన్నిసార్లు తుదిపోరుకు అర్హత సాధించలేదు.
- వరుసగా నాలుగో సారి తుదిపోరుకు అర్హత సాధించింది యువ టీమ్‌ఇండియా.
- అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా భారత్ నాలుగు టైటిళ్లు గెలిచింది. 2000(మహ్మద్ కైఫ్ సారథ్యంలో), 2008 (కోహ్లీ), 2012 (ఉన్ముక్త్ చంద్), 2018లో (పృథ్వీ షా) విజేతగా అవతరించింది. మూడుసార్లు (2006, 2016, 2020)లో రన్నరప్‌గా నిలిచింది.
- చివరగా 2018లో అండర్-19 ప్రపంచకప్‌లో పృథ్వీ షా సారథ్యంలో దేశానికి టైటిల్ దక్కింది.
- మరోవైపు అజేయంగా ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ కూడా 24 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఈ ప్రపంచకప్ గెలిచింది. 1998లో తొలిసారి ఈ కప్పు ఫైనల్‌కు చేరిన ఆ జట్టు విజేతగా నిలిచింది.
ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా
కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొనే ఓపెనర్లు.. ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్.. అదిరే ముగింపునిచ్చే ఫినిషర్లు.. ఇలా బ్యాటింగ్‌లో భారత్ పటిష్ఠంగా ఉంది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం మన బలాన్ని చాటుతోంది.
ఇంగ్లాండ్ బలం
భారత ప్రత్యర్థి ఇంగ్లాండ్ తక్కువదేమీ కాదు. ఆ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తుదిపోరు చేరింది. ఇంగ్లాండ్ కెప్టెన్ టామ్ ప్రెస్ట్ (292) ఇప్పటివరకూ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్ జాకోబ్ బెతెల్ (203), జార్జ్ బెల్, అలెక్స్ కూడా ప్రమాదకరమే. ఇక బౌలింగ్‌లో పేసర్ జోషువా బాయ్‌డెన్, మణికట్టు స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌లతో జట్టు బలంగా ఉంది.
ఫైనల్‌కు చేరాయిలా
భారత్
గ్రూప్- బి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో, ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో, ఉగాండాపై 326 పరుగుల తేడాతో విజయాలు.
క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు.
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం.
ఇంగ్లాండ్
గ్రూప్- ఎ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్లతో, కెనడాపై 106 పరుగుల తేడాతో, యూఏఈపై 189 పరుగుల తేడాతో విజయాలు.
క్వార్టర్స్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు.
సెమీస్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అఫ్గానిస్థాన్‌పై 15 పరుగుల తేడాతో విజయం
ఇదీ చూడండి: కోహ్లీతో మాట్లాడాక ఆత్మవిశ్వాసం పెరిగింది: అండర్-19 కెప్టెన్