Southee on Kohli:టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీపై న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం మంచిదే అని చెప్పాడు. తాజాగా ఓ ఓటీటీలో మాట్లాడిన సౌథీ కోహ్లీ కెప్టెన్సీ వివాదంపై స్పందించాడు.
"టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉంటే ఎదురయ్యే పరిస్థితులు, ఒత్తిడి ఏంటో నాకు తెలియదు. అది కేవలం భారత క్రికెట్‌కే కాకుండా ఐపీఎల్‌లోనూ అర్థంకాని పరిస్థితి. కోహ్లీ సారథిగా కొన్నేళ్లపాటు రాణించాడు. ఓ వైపు ఆటతో, మరోవైపు కెప్టెన్‌గా రాణించడం కోహ్లీ అభిమానులకు నచ్చుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండటం అతడిపై భారం తగ్గిస్తుంది. అతడు ఆడినన్ని రోజులు జట్టుకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోహ్లీ అలాంటి వ్యక్తి. ఆర్సీబీలో కొత్త సారథికి, టీమ్‌ఇండియాలో రోహిత్ శర్మకు విరాట్ తన సహకారం అందించి ఆయా జట్లను ముందుకు తీసుకెళ్తాడు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు ఎప్పుడూ ఆట పట్ల అంకితభావంతో ఉంటూ జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడు."
-టిమ్ సౌథీ, న్యూజిలాండ్ పేసర్
విరాట్ కోహ్లీ రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేకపోవడంపై స్పందిస్తూ.. ఎవరైనా అతడిలా ఆడితే, అతడు సాధించినన్ని పరుగులు చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చెప్పాడు. చివరగా కోహ్లీ.. న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై మాట్లాడుతూ.. అతడిలాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం తమ అదృష్టమని అన్నాడు. అయితే, కైల్ జేమీసన్ అతడికి బాగా బౌలింగ్ చేస్తాడన్నాడు.