INd VS WI T20 Series Preview: మరో 8 నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న వేళ వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. గ్రూప్ దశలోనే ఇంటిముఖంపట్టి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. జట్టులో సమతూకం లేకపోవడం ఆ టోర్నీలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చివరికి టీ20 సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ వైదొలగాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ అందించడంపై గురిపెట్టాడు. జట్టులో ఓపెనింగ్, మిడిల్‌ఆర్డర్ సమస్యల పరిష్కారం సహా బౌలింగ్‌లో వ్యూహాలను రోహిత్ పదును పెట్టాల్సి ఉంది.
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న 10 మంది సభ్యులకు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఇషాన్ కిషన్‌ను ఏకంగా 15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకోగా శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడం వల్ల రోహిత్‌శర్మతో కలిసి ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్న విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. 2019 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ శతకం కూడా కోహ్లీ నమోదు చేయలేదు. మిడిల్‌ఆర్డర్ సమస్యలు కూడా టీమిండియా పరిష్కరించుకోవాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరికీ మిడిల్‌ఆర్డర్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చారు. సూర్యకుమార్‌యాదవ్ వన్డే సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లకు బ్యాట్ ఝుళిపించగల సత్తా ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హర్షల్ పటేల్ మెరుగ్గా రాణించాడు. స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్‌కు తుదిజట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్‌లో రాణించిన రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి.
మరోవైపు వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన వెస్టిండీస్ తమకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. జట్టులో టీ20 స్పెషలిస్టులు ఉండటం విండీస్‌కు కలిసి వచ్చే అంశం. ఇటీవలే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-2తో ఓడించిన కరీబియన్ జట్టు.. భారత్‌పై కూడా మెరుగ్గా రాణించాలని కోరుకుంటోంది. లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం, హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఐదు రోజుల వ్యవధిలో 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో నాలుగు మైదానాలను సిద్ధం చేశారు. బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: కోహ్లీ ఫామ్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు!