న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ కోసం సిద్ధమైంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అందుకు సరైన జట్టును ఎంపిక చేసేందుకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం వన్డేల్లో న్యూజిలాండ్ జట్టు నంబర్-1 ర్యాంక్‌లో ఉంది. గతంలో న్యూజిలాండ్‌పై 5-0తో టీ20 సిరీస్ నెగ్గిన భారత్ ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఈసారి అది పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, బుమ్రా వంటి వన్డే రెగ్యులర్ ప్లేయర్లు లేకుండానే ఈ సిరీస్‌లో భారత్ బరిలోకి దిగనుంది. శిఖర్‌ధావన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. శుభమన్ గిల్‌తో కలిసి ధావన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. 8 వన్డేల్లో వీరిద్దరి జోడి మూడు సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పడం విశేషం. న్యూజిలాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో శుభమన్ గిల్ ఆడకపోయినా ఈ ఏడాది వన్డేల్లో అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 75.71 సగటుతో 530 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉండగా..శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడాతో టీమిండియా మిడిల్ ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ మరోసారి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్‌తో కలిసి దీపర్ చాహర్, శార్దూల్ ఠాకూర్ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. ఆల్‌రౌండర్ బెర్త్ వాషింగ్టన్ సుందర్‌కు దక్కే అవకాశం ఉంది. దీపర్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లోయర్ ఆర్డర్‌లో భారత్ బ్యాటింగ్‌కు అదనపు బలం.
ఇటీవల వన్డేల్లో కేవలం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌లో కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనుంది. అలెన్, కాన్వే, లాథమ్, మిచెల్, ఫిలిప్స్ వంటి బ్యాటర్లతో ఆ జట్టు బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. టిమ్ సౌథీ, హెన్నీ, లాకీ ఫర్, సాంట్నర్, నీషమ్ బౌలింగ్ విభాగంలో అండగా ఉన్నారు.
ఇదీ చూడండి: దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం!.. 'ప్లీజ్ డీకే.. వద్దు' అంటున్న ఫ్యాన్స్