Teamindia South africa series Rohith: టీమ్ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9 నుంచి 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. వారిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ఈ సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకోవడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. హిట్‌మ్యాన్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. "రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడాలని అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతని వ్యక్తిగతం. విశ్రాంతి అనేది అతడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ, రోహిత్‌కి విరామం అవసరం ఉందని నేను అనుకోను. అతను ఆడాలి. ఇది సుదీర్ఘమైన సిరీస్. రోహిత్ శర్మ కెప్టెన్ కూడా.. ఈ విషయాన్ని మర్చిపోకండి. భారత టీ20 లీగ్‌లో అతడు గత కొన్ని సీజన్లలో 400కి పైగా పరుగులు చేయలేదు. 400 పరుగుల మార్క్‌ను దాటిన వారు చాలా మంది ఉన్నారు. టోర్నమెంట్‌లో అతడు నిలకడగా ఆడలేదు. కానీ, రెండు, మూడు సార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి, రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని అందరూ భావిస్తారు. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లు కావాలి. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో రాణించిన జట్టు విజయం సాధిస్తుంది" అని ఆర్పీ సింగ్ వివరించాడు.
ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లో రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతడు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కాగా, దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది.
ఇదీ చూడండి: అంతర్జాతీయ పోటీల్లో తెలుగమ్మాయి జ్యోతికకు స్వర్ణం