Teamindia ODI Rankings: ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ముందడుగు వేసింది. దీంతో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకొంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై పది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకుని ముందుకు ఎగబాకింది. 108 పాయింట్లను సాధించి మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్ (106) కిందికి దిగజారింది. ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు మ్యాచుల్లో భారత్ ఓటమిపాలైతే మళ్లీ పాక్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ గెలిస్తే రెండో స్థానానికి దగ్గరగా రావొచ్చు.
ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ (127), ఇంగ్లాండ్ (122) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్ (101) ఐదో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా (99) ఆరో స్థానం, బంగ్లాదేశ్ (97) ఏడు, శ్రీలంక (92) ఎనిమిది, విండీస్ (71) తొమ్మిది, అఫ్గానిస్థాన్ (69) పదో స్థానాల్లో నిలిచాయి.
ఆటగాళ్ల పరంగా.. గత నెల 24 వరకు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ర్యాంకులను ఐసీసీ అప్‌డేట్ చేసింది. దాని ప్రకారం.. వన్డేల్లో బ్యాటర్ల పరంగా టీమ్‌ఇండియా నుంచి ఇద్దరు టాప్-10లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (811), నాలుగో స్థానంలో రోహిత్ శర్మ (791) ఉన్నారు. తొలి రెండు స్థానాలు పాక్‌కు చెందిన ఆటగాళ్లవే కావడం గమనార్హం. బాబర్ అజామ్ (892), ఇమామ్ ఉల్‌హక్ (815) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అదే విధంగా బౌలింగ్‌లో బుమ్రా (679) ఒక్కడే భారత్ నుంచి టాప్-10లో ఉన్నాడు. బుమ్రా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా తొలి పది స్థానాల్లో లేరు. రవీంద్ర జడేజా (224) పన్నెండో స్థానంలో నిలిచాడు.
ఇదీ చూడండి: బుమ్ బుమ్ బుమ్రా... ఇంకా సిక్స్ వికెట్స్ హీరోస్ ఎవరెవరంటే?