టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి టెస్టు జట్టులోకి అడుగు పెట్టనున్నాడు! శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లాండ్‌కు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట. గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానాన్ని అతడితో భర్తీ చేయాలన్నది జట్టు యాజమాన్యం ఉద్దేశంమని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో పృథ్వీ షా జట్టులో చోటు కోల్పోయాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని సమస్యలు ఉండటమే ఇందుకు కారణం. దీంతో అతడు దేశవాళీ క్రికెట్ ఆడి టెక్నిక్‌ను మెరుగు పర్చుకున్నాడు. పరుగుల వరద పారించాడు. ఐపీఎల్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. అప్పుడు షా స్థానంలోనే జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడిన అతడు గాయపడటం వల్ల ఇంగ్లాండ్ పర్యటనకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అభిమన్యు ఈశ్వరన్ జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్‌ను ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్ ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. అతడిని మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అరంగేట్రం చేయలేదు కాబట్టి అభిమన్యుకు వెంటనే అవకాశం ఇవ్వకపోవచ్చు. సుదీర్ఘ సిరీస్ కావడం వల్ల వీరిలో ఎవరైనా గాయపడే అవకాశం ఉందని పృథ్వీ షాకు కబురు పంపిస్తున్నారని తెలిసింది.
"పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. అతడు ఇంగ్లాండ్‌కు వెళ్తే జట్టుకు సౌకర్యంగా ఉంటుంది. గిల్‌కు గాయమై ఐదు రోజులైనా సెలక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభిమన్యు ఈశ్వరన్‌పై పూర్తిగా ఆధారపడే అవకాశం లేదు. అందుకే వీరోచిత ఫామ్‌లో ఉన్న షాను తీసుకోవడమే సమయోచితంగా అనిపిస్తోంది. ఇప్పటికే అతడి గురించి అందరికీ తెలుసు. జట్టు యాజమాన్యం అతడి అవసరం ఉందని చెబితే బీసీసీఐ అతడిని ఎందుకు పంపించదు?" అని బోర్డు వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి: KL Rahul: ధోనీ కోసం చావడానికైనా సిద్ధం