మళ్లీ అదే వ్యథ.. చివరవరకు వచ్చి కప్ చేజారిపోయింది. ప్రపంచ తొలి టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ ముద్దాడాలనే కల చెదిరిపోయింది. అయితే ఇలా జరగడం భారత జట్టుకు కొత్త కాదు. ఎందుకంటే గత ఎనిమిదేళ్లలో ఆరు ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియా తుది మెట్టుపై బోల్తాకొట్టింది. మరి దీనికి పరిష్కారం ఏంటి?
ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. ఇంగ్లాండ్ వేదికగా మ్యాచ్‌లు. అయితేనేం టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న భారత్.. వర్షం వల్ల తక్కువ ఓవర్లకే కుదించిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలిచి సగర్వంగా కప్‌ను అందుకుంది. ఆ తర్వాత నుంచి భారత్‌ను దురదృష్టం వెంటాడుతోంది.
- 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి.
- 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం
- 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వెస్టిండీస్‌పై ఓడిన భారత్
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం
- 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
- 2021 టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా.
కోహ్లీపై ట్రోల్స్
పైన చెప్పిన టోర్నీలు అన్నింటిలో కోహ్లీ టీమ్ఇండియా తరఫున ఆడాడు. కెప్టెన్‌గా పైన చెప్పిన వాటిలో మూడు ఐసీసీ టోర్నీల్లో ఆడిన కోహ్లీ.. జట్టును విజేతగా నిలుపడంలో విఫలమయ్యాడు. దీంతో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ధోనీతో అతడిని పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జట్టు విజేతగా నిలవడమనేది సమష్టి ప్రదర్శనతో పాటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది!
టెస్టు జట్టులో మార్పులు
టెస్టు ఛాంపియన్షిప్ ఓటమి అనంతరం మాట్లాడిన కోహ్లీ.. టెస్టు జట్టులో మార్పులు చేయాల్సిన అవసరముందని అన్నాడు. జట్టు కూర్పును వెంటనే సమీక్షించుకుంటామని, బాగా ఆడగలిగే సరైన వైఖరి గల ఆటగాళ్లను ఎంపిక చేస్తామని చెప్పాడు. టెస్టు జట్టులో ఇలాంటి మార్పులు అవసరమని పేర్కొన్నాడు.
బలంగా పరిమిత ఓవర్ల జట్టు
సుధీర్ఘ ఫార్మాట్‌తో పోలిస్తే టీమ్ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బలంగా ఉంది. ఇంటా బయటా పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ప్రత్యర్థిని మట్టికరిపిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి తుది మెట్టుపై బోల్తాకొడుతున్న కోహ్లీసేన.. ఈ ఏడాది అక్టోబరులో స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలి. లేదంటే మళ్లీ అదే ఫలితం పునరావృతం కావొచ్చు.
కోహ్లీ కెప్టెన్సీపైనా రచ్చ
ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. సిరీస్, టోర్నీలో విఫలమైనా ప్రతిసారీ విరాట్‌ను సారథిగా తప్పించాలని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బోర్డు, కోహ్లీగానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
ముందున్నాయి ఐసీసీ టోర్నీలు
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్(యూఏఈ), ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచకప్(భారత్) కూడా ఉన్న దృష్ట్యా కెప్టెన్ కోహ్లీ మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది. తన నేతృత్వంలో ఐసీసీ కప్ దక్కించుకుని విమర్శకులకు సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇవీ చదవండి:
ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే