మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఆఖరి సమరానికి అంతా సిద్ధమైంది. టైటిల్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతున్న టీమ్ఇండియా.. శుక్రవారం ఆరంభమయ్యే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. సౌథాంప్టన్(ఇంగ్లాండ్)లో శుక్రవారం(జూన్ 18) నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌కు గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. సత్తా మేర ఆడితే ట్రోఫీని ముద్దాడడం కష్టమేమీ కాదు. కానీ ప్రత్యర్థి కూడా తక్కువదేమీ కాదు. కివీస్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
•బలంగానే ఉన్నా.. భారత్‌కు ఫైనల్లో సవాళ్లు తప్పదు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు కఠిన పరీక్ష పెట్టనున్నాయి. సెషన్.. సెషన్‌కు మారిపోయే అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డ జట్టే విజయం సాధించగలదు.
• కివీస్‌కు మాత్రం పరిస్థితులు సానుకూలమే. ఆ దేశంలో ఉన్నట్లుగానే ఇక్కడ పరిస్థితులుంటాయి. మబ్బులు కమ్మి, వాతావరణం చల్లగా మారితే అప్పుడు పేసర్లు విజృంభించే అవకాశాలు ఎక్కువ. ఆ పరిస్థితుల్లో పచ్చికతో నిండిన పిచ్‌పై పేస్, స్వింగ్‌తో వికెట్ల పండగ చేసుకోవడం కివీస్ పేసర్లకు అలవాటే. ఈ విషయంలో మన పేసర్లనూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ మనవాళ్ల కంటే.. చాలా రోజులుగా ఇక్కడ ఉన్న కివీస్ పేసర్లకే ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది.
• ఇటీవల ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆ జట్టు 1-0తో సొంతం చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. 2019 నవంబర్ నుంచి 12 ఇన్నింగ్స్‌ల్లో 24 సగటుతో అతను 288 పరుగులు మాత్రమే చేశాడు. శతకం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నాడు. డబ్ల్యూటీసీలో భాగంగా న్యూజిలాండ్‌లో జరిగిన సిరీస్‌లో 0-2తో ఓడిపోవడం భారత్‌కు ప్రతికూలాంశం.