కొద్దికాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు టీమ్ఇండియా అండగా ఉందని భారత జట్టు కొత్త బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. టెస్టు క్రికెట్లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని.. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారని చెప్పాడు.
"టెస్టు క్రికెట్లో అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలకు తగినంత అనుభవం ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారు. అందుకే, ఓ జట్టుగా మేమంతా వాళ్లకు అండగా నిలబడ్డాం. వారి నుంచి టీమ్ఇండియా ఏమి ఆశిస్తుందో వారికి బాగా తెలుసు. వారిద్దరూ పుంజుకుంటే మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది."
-పరాస్ మాంబ్రే, టీమ్ఇండియా బౌలింగ్ కోచ్
IND vs NZ 2nd Test: కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. డిసెంబర్ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానుండటం వల్ల.. తుదిజట్టులో రహానేకు చోటు లభిస్తుందా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది!