Kohli ODI captaincy: టీమ్ఇండియా టీ20 సారథిగా ఇటీవలే తప్పుకొన్న విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అనే విషయపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో మరో టీ20 ప్రపంచకప్ టోర్నీ ఉన్న నేపథ్యంలో అంతకుముందు టీమ్‌ఇండియా కేవలం తొమ్మిది వన్డేలే ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో చెరో మూడు వన్డేలు ఆడనుండగా భారత్‌లోనూ మరో మూడు మ్యాచ్‌లే ఆడనుంది. అయితే, 2023లో భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ కూడా ఖరారైన నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదనే అభిప్రాయం బీసీసీఐ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీ20ల్లాగే వన్డేల్లోనూ రోహిత్‌కు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే 2023 నాటికి జట్టును సమర్థవంతంగా నడిపించేందుకు వీలుంటుందని పలువురు భావిస్తున్నారు. దీంతో రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి జట్టును ఎంపిక చేసినప్పుడే వన్డే ఫార్మాట్‌కు కోహ్లీ కెప్టెన్సీపై స్పష్టత రానుంది. ఈ శనివారం కోల్‌కతాలో బీసీసీఐ ఏజీఎం సమావేశం జరగనుంది. అక్కడ చేతన్ శర్మ సెలెక్షన్ ప్యానెల్ టెన్యూర్‌ను పొడిగించనున్నారు. అప్పుడు కోహ్లీ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఏదేమైనా కోహ్లీ ఒక్క పెద్ద ట్రోఫీ కూడా అందించలేని పరిస్థితుల్లో అతడిని తొలగించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కానీ, దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జైషా తుది నిర్ణయం తీసుకోవాలి.
మరోవైపు తాజాగా దక్షిణాఫ్రికాలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆ పర్యటనపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, టోర్నీ యథావిథిగా కొనసాగుతుందని బీసీసీఐ అధికారులు బుధవారం మీడియాకు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన జట్టును త్వరలోనే ప్రకటిస్తామన్నారు. టోర్నీని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం ఏమైనా అత్యవసర ఆదేశాలు జారీ చేస్తే తప్ప షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరుగుతుందని వెల్లడించారు.
ఇదీ చూడండి: సందిగ్ధంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్.. కోహ్లీ స్పందన ఇదే!