టీమ్‌ఇండియా మహిళా ప్లేయర్ తానియా భాటియా తనకు ఎదురైన చేదు అనుభవంపై మరోసారి ఘాటుగా స్పందించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన భారత జట్టు ఒక హోటల్‌లో బస చేసింది. అక్కడ తన బ్యాగు చోరీకి గురైందని ఇటీవల ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించలేదు. ఆ బ్యాగులో ఉన్న వస్తువులు తనకు ఎంతో విలువైనవని దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది.
"నా ఫిర్యాదుపై ఇప్పటివరకు యాజమాన్యం స్పందించలేదు. ఇది నిజంగా బాధ కలిగిస్తోంది. చోరీకి గురైన వస్తువులు నాకెంతో విలువైనవి, ముఖ్యమైనవి. ఇప్పటివరకు దీనిపై చర్యలేమైనా తీసుకున్నారా? నాకు తెలియజేస్తే బాగుంటుంది’’ అంటూ తానియా ట్విటర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. లండన్ పర్యటన అనంతరం తానియా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. "మాకు కేటాయించిన హోటల్ సురక్షితం కాదు. నా వ్యక్తిగత గదిలోకి ఎవరో వచ్చారు. విలువైన ఆభరణాలు, కార్డులు, నగదు ఉన్న నా బ్యాగును దొంగిలించారు. క్రికెటర్లకు భద్రత కల్పించడంలో ఈసీబీకి భాగస్వామి అయిన ఈ హోటల్ ఇంత వైఫల్యం చెందడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వెంటనే దీనిపై విచారణ జరిపి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా" అని పోస్ట్ చేసింది. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: అగ్రస్థానానికి అడుగు దూరంలో సూర్య.. కోహ్లీ, రోహిత్ ఎక్కడున్నారంటే?