ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. వేరే టీమ్స్ తరఫున ఆడి, సీఎస్‌కేలోకి వెళ్లిన కొందరు ప్లేయర్లు... స్టార్లుగా మారుతున్నారు. సీఎస్‌కేలోనే కెరీర్ ప్రారంభించాలని అనుకున్నవాళ్లు మాత్రం ఏళ్ల పాటు రిజర్వు బెంచ్‌లోనే ఉంటున్నారు. 14 సీజన్లలో సీఎస్‌కే నుంచి వెలుగులోకి వచ్చిన కుర్రాళ్ల సంఖ్య చాలా తక్కువ.. అయితే ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత సీన్ కాస్త మారింది. రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ చౌదరి వంటి కుర్రాళ్లు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు.
అయితే హరి నిశాంత్, నారాయణ్ జగదీశన్ వంటి దేశవాళీ స్టార్లు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023 ఐపీఎల్ సీజన్‌కు ముందు నారాయణ్ జగదీశన్‌ను మినీ వేలానికి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మూడు సీజన్లలో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు 30+ స్కోర్లు చేసిన ఎన్ జగదీశన్.. విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో మాత్రం తన సత్తా చూపిస్తున్నాడు.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఎన్ జగదీశన్. లిస్టు ఏ క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 44 బంతుల్లో 55 పరుగులు, 70 బంతుల్లో సెంచరీ, 102 బంతుల్లో 159 పరుగులు చేసిన జగదీశన్, ఆ తర్వాత బౌండరీల మోత మోగించాడు. 114 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్నాడు. సాయి సుదర్శన్‌తో కలిసి తొలి వికెట్‌కు 416 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించాడు. లిస్టు ఏ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు సాధించాడు జగదీశన్.
268 పరుగులతో ఇంగ్లాండ్ ఆటగాడు అలీ బ్రౌన్ పేరిట ఉన్న రికార్డును జగదీశన్ చెరిపివేశాడు. 2014లో శ్రీలంకపై రోహిత్ చేసిన 264 పరుగులను ఘనతను సైతం అధిగమించాడు. ఈ రికార్డు నమోదు చేసే క్రమంలో 114 బంతుల్లోనే 200 పరుగులను పూర్తిచేసిన జగదీశన్.. ఫాసెస్ట్ డబుల్ సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. అటు విజయ్ హజారే ట్రోఫీలో పృథ్వీషా చేసిన 227 పరుగులు ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా ఉండగా దానిని సైతం జగదీశన్ ఇన్నింగ్స్ చెరిపివేసింది.
మరోవైపు ప్రస్తుత విజయ హజారే ట్రోఫీలో విశేషంగా రాణిస్తున్న జగదీశన్ వరుసగా నాలుగు సెంచరీలు బాది కుమార సంగక్కర, పీటర్సన్, దేవదత్ పడిక్కల్ సరసన నిలిచాడు. అయితే 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది తమిళనాడు. లిస్టు ఏ క్రికెట్‌లో 500 మార్కు దాటిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది తమిళనాడు.