టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీఫైనల్లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని అందుకుంది టీమ్‌ఇండియా. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఏమీ ఓడిపోలేదు. ఎంపికలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొండితనం.. ఓటముల నుంచి ఏమాత్రం నేర్చుకొని ఆటగాళ్ల తీరు కలిసి జట్టు అవమానకర రీతిలో ఓటమిని మూటగట్టుకొంది. టీమ్‌ఇండియా ఆడిన గ్రూప్-బిలో పాక్, దక్షిణాఫ్రికా మినహా మిగిలిన జట్లు మొత్తం పసికూనలే. అయినా కానీ, భారత్ సెమీస్‌కు చేరడానికి చెమటోడ్చింది. టోర్నీ మొత్తంలో విరాట్, సూర్య, అర్షదీప్ రాణించగా.. పాండ్యా కొంత మెరుగ్గా ఆడాడు.
ఆల్ రౌండర్లు.. కీపర్లతో జట్టుకు దక్కిందేమిటీ..? ఆరు మ్యాచుల్లో కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే 200కు పైగా పరుగులు సాధించగా.. ముగ్గురు బ్యాటర్లు 150 లోపే పరుగులు చేశారు. పవర్ ప్లే అవకాశాలను ధ్వంసం చేసిన అపవాదును ఓపెనర్లు మూటగట్టుకొన్నారు. ఈ టోర్నీలో పవర్‌ప్లేలో భారత్ రన్‌రేట్ 6..! అతి తక్కువ రన్‌రేట్ ఉన్న నెదర్లాండ్స్ (5.4), జింబాబ్వే (5.7) తర్వాత స్థానం మనదే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ జరిగిన అడిలైడ్ బ్యాటింగ్ పిచ్. ఇక్కడ కూడా తొలి 10 ఓవర్లకు భారత్ సాధించిన స్కోర్ 62. అదే ఇంగ్లాండ్ తొలి 10 ఓవర్లలో 98 పరుగులు చేసి మ్యాచ్‌ను లాగేసుకొంది. ఇక భారత్ చివరి 10 ఓవర్లలో 106 పరుగులు చేసింది. ఈ గణాంకాలు చాలు టాప్‌ఆర్డర్ ఆటతీరును చెప్పడానికి.
హార్దిక్ మినహా ఏ ఆల్‌రౌండర్ ఓ మోస్తారు ప్రదర్శన కూడా చేయలేదు. అశ్విన్, అక్షర్ కలిపి చేసిన పరుగులు 30 అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హుడాను కూడా ఒక మ్యాచ్‌లో ఆడించగా.. డకౌట్‌గా పెవిలియన్ చేరుకొన్నాడు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేయలేదు.
సాధారణంగా బ్యాటింగ్ మెరుగ్గా చేసే వ్యక్తిని కీపర్‌గా తీసుకుంటారు. భారత్ ఈ టోర్నీలో ఇద్దరు కీపర్లతో ప్రయోగాలు చేసింది. వారిద్దరూ కలిపి చేసిన మొత్తం పరుగులు 23..!
బౌలింగ్‌లో పేస్ దళానికి అండగా నిలిచే మిడిల్ ఓవర్ బౌలర్లు కరవయ్యారు. భువి, అర్ష్‌దీప్‌లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. సూపర్ 12 దశలో భువి ఐదు మ్యాచుల్లో 16.4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. 65 డాట్‌బాల్స్ విసిరాడు. అర్ష్‌దీప్ కూడా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ మినహా టోర్నీ మొత్తంలో నిలకడగా వికెట్లు సాధించాడు. టీమ్ ఇండియాకు నాలుగు, ఐదు, ఆరో బౌలర్ల స్థానంలో ఆల్ రౌండర్లు అశ్విన్, అక్షర్, హార్దిక్ బౌలింగ్ చేశారు. అక్షర్ ఐదు మ్యాచ్‌లకు 3 వికెట్లు సాధించగా.. అశ్విన్ ఆరు మ్యాచ్‌లకు 6 వికెట్లు.. హార్దిక్ 8 వికెట్లు పడగొట్టారు. కానీ, ధారాళంగా పరుగులు ఇచ్చుకొన్నారు. అడిలైడ్ పిచ్ సీమర్లకు ఏమాత్రం సహకరించదు.. స్పిన్నర్లు జట్టుకు వికెట్లను అందించాల్సిన చోట చేతులెత్తేశారు.
కోచ్‌గా ద్రవిడ్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో విఫలం అయ్యాడు. ఒత్తిడిని తట్టుకోవడం ప్రత్యేకంగా ఎవరికీ నేర్పించలేం అంటూ రోహిత్ చెప్పడం విడ్డూరంగా ఉంది. జట్టులో కోచ్ పాత్ర ఏమిటో ద్రవిడ్‌కు తెలియంది కాదు. దీనికి తోడు విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. కానీ, ప్రపంచకప్ వంటి టోర్నీలకు మ్యాచ్ విన్నర్లనే తీసుకెళ్లాలి. ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు.
వ్యక్తిగత ఆటతీరు ఇలా..
కెఎల్ రాహుల్: 6 మ్యాచ్‌లు ఆడి 128 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్, జింబాబ్వేతో మ్యాచ్‌ల్లో అర్ధశతకాలను మినహాయిస్తే.. అతడి స్కోర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచడానికి కారణంగా మారాడు.
రోహిత్ శర్మ: 6 మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ జట్టును నడిపించడంలో విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్‌పై అర్ధశతకం మినహా టోర్నీలో గొప్పగా ఆడిందేమీ లేదు.
విరాట్ కోహ్లీ: ఈ టోర్నీలో భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. పరిస్థితిని బట్టి జట్టును ఆదుకొంటూ నాలుగు అర్ధశతకాలు చేశాడు. మొత్తం మీద 296 పరుగులు సాధించి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా పాక్‌పై అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
సూర్యకుమార్ యాదవ్: ఈ టోర్నీతో టీ20 క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. మూడు అర్ధశతకాలతో 239 పరుగులు చేశాడు. జింబాబ్వేపై ఇన్నింగ్స్ సంచలనం సృష్టించింది.
హార్దిక్ పాండ్యా: పాండ్యా ఆల్‌రౌండర్‌గా మెరుగ్గానే ఆడాడు. పాక్‌పై విలువైన 40 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో కూడా (3/30) రాణించాడు. కోహ్లీ హైవోల్టేజ్ ఇన్నింగ్స్‌తో పాండ్యా ప్రదర్శన వెలుగులోకి రాలేదు. ఇంగ్లాండ్‌పై కూడా అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమ్ ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 6 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 128 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీశాడు. జట్టులో అర్ష్‌దీప్ తర్వాత అత్యధిక వికెట్లు తీసింది ఇతడే.
దినేష్ కార్తిక్ : ధోనీ తర్వాత ఆ స్థానం భర్తీ చేసే కీపర్ టీమ్ ఇండియాకు దొరకలేదనే విషయం ఈ టోర్నీతో తేలిపోయింది. దినేష్ కార్తిక్ మ్యాచ్ ఫినిషర్ అనిపించుకొనే స్థాయి ప్రదర్శన ఒక్కటి కూడా లేదు. 4 మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్ ఆడి 14 పరుగులు మాత్రమే చేశాడు.
పంత్: ఆడింది రెండు మ్యాచ్‌లే.. కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వచ్చి పేలవంగా ఆడాడు.
రవిచంద్రన్ అశ్విన్: ఆల్‌రౌండర్‌గా అశ్విన్ ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 21 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. జింబాబ్వేపై సాధించిన మూడు వికెట్లను తీసేస్తే మిగిలిన మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన ఏంటో తెలుస్తుంది.
అక్షర్ పటేల్: ఇతడిని టోర్నీలో ఎందుకు ఆడించారో కోచ్, కెప్టెన్‌కే తెలియాలి. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. బ్యాటర్‌గా అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ కూడా ఏమీ లేవు. 5 మ్యాచ్‌లు ఆడి 9 పరుగులు చేసి 3 వికెట్లు సాధించాడు.
భువనేశ్వర్ కుమార్: ఇంగ్లాండ్‌పై మ్యాచ్ మినహా భువి మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థులు చెలరేగిపోకుండా నియంత్రించాడు. కానీ, ప్రధాన బౌలరై ఉండి వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి.
షమి: ఈ టోర్నీలో షమి సీనియార్టీ ఎక్కడా ఉపయోగపడలేదు. 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు.
అర్ష్‌దీప్ సింగ్: జూనియర్ అయిన అర్ష్‌దీప్ జట్టులో స్టార్‌గా అవతరించాడు. తొలి ఓవర్లలోనే వికెట్లు సాధిస్తూ జట్టుకు మ్యాచ్‌ల్లో ఆధిపత్యం అందించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు సాధించాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాలో అదే అతి పెద్ద సమస్య.. ఇంకెన్నాళ్లు మోయాలి బాధ!