టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ప్రాక్టీస్ సెషల్ కూడా పాల్గొంది. అయితే ఈ నెట్ సెషన్లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సహ ఆటగాళ్లు సహా అభిమానులు ఆందోళన చెందారు. మరి కొంతమందికి.. సెమీఫైనల్లో హిట్‌మ్యాన్ ఆడతాడా లేదా అనే అనుమానం కూడా వ్యక్తమైంది. అయితే తన గాయంపై స్పందించాడు హిట్‌మ్యాన్. అలానే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్ గురించి కూడా మాట్లాడాడు.
"నిన్న దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడు బాగానే ఉన్నట్లుంది. చిన్న గాయమే బాగానే ఉన్నాను. మాకు టీ20 క్రికెట్ నేచర్ తెలుసు. కానీ ఇంగ్లాండ్‌ను తమ సొంత గడ్డపై ఓడించడం సవాల్ లాంటిది. మేము దాన్ని అధిగమించాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కచ్చితంగా మేం కోరుకున్నది చేయడానికి ఈ సెమీస్ ఒక అవకాశం. ఈ టోర్నీలో మేం బాగా రాణించాం. ఇప్పటి వరకు మేం ఆడిన విధాన్నాన్ని చూసి మాపై నమ్మకం ఉంచండి. ఇది బ్యాట్-బంతికి మధ్య ఉన్న పోటీ. ఇక సూర్యకుమార్ విషయానికొస్తే.. అతడు ఆటలో చాలా పరిణితి కనబరిచాడు. తనతో బ్యాటింగ్ చేసే వాళ్లపై ఆ ప్రభావం పడుతుంది. ఎప్పుడు పెద్ద మైదానాల్లోనే ఆడాలనుకుంటాడు. చిన్న గ్రౌండ్స్‌పై ఆసక్తి చూపడు. ఎందుకంటే అతడికి ఆకాశమే హద్దు.ఎలాంటి బెదురు లేకుండా ఆడటం అతడి సహజ ప్రతిభను తెలియజేస్తోంది. తనతోపాటు ఎలాంటి బ్యాగేజీని తీసుకెళ్లని ఏకైక ఆటగాడు. ఇప్పటికే బోలెడన్ని సూట్‌కేసులు ఉన్నా.. షాపింగ్ చేయడం ఇష్టపడతాడు (నవ్వుతూ). బ్యాటింగ్‌లో ఎలాంటి ఒత్తిడి అనుభవించడు. అతడి ఆటలోనే అది కనిపిస్తుంది. జట్టు స్కోరు 10/2 అయినా.. 100/2 అయినా సరే ఒకేలా దూకుడుగా బ్యాటింగ్ చేయడం సూర్యకుమార్‌కు మాత్రమే సొంతం." అని రోహిత్ పేర్కొన్నాడు.
లోయర్ ఆర్డర్‌లో మాత్రం దినేశ్ కార్తిక్ అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా.. గత మ్యాచ్‌లో పంత్‌కు అవకాశం కల్పించారు. జింబాబ్వేపై పంత్ కూడా తడబాటుకు గురి కావడంతో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. దానిపైనా రోహిత్ వివరణ ఇచ్చాడు. "డీకే, పంత్‌కు సంబంధించిన విషయంలో గత మ్యాచ్‌ను మాత్రమే తీసుకొంటే.. యువ బ్యాటర్ విఫలమయ్యాడు. అయితే కేవలం రెండు మ్యాచుల్లోనే (ఒకటి ప్రాక్టీస్ మ్యాచ్, రెండోది జింబాబ్వేపై) పంత్ ప్రాతినిధ్యం వహించాడు. రెండు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే అతడికి కాస్త సమయం ఇవ్వాలని భావించాం. ఇక సెమీస్ కోసం అవసరమైతే జట్టులో మార్పులు కూడా చేస్తాం. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సహచరులకు చెప్పాం. సెమీస్‌లో ఎలాంటి జట్టుతో బరిలోకి దిగబోతున్నామనేది ఇప్పుడే చెప్పలేం. అయితే లెఫ్ట్‌ఆర్మ్ ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావిస్తున్నాం. గురువారం ఏం జరగబోతుందో అంచనా వేయొద్దు. అందుకే ఇద్దరు కీపర్లు తుది జట్టు ఎంపిక కోసం మా దృష్టిలో ఉన్నారని చెబుతున్నా" అని వెల్లడించాడు.
ఇదీ చూడండి: సెమీస్ ముందు టీమ్ఇండియాకు తప్పిన ప్రమాదం.. కెప్టెన్ రోహిత్‌కు..