కంగారూ గడ్డపై టీ20 ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి జట్ల మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరుకు వేదికలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 16న 2022 టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుంది. ఇప్పటికే ఈ పొట్టి కప్పు కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకోగా.. మిగతా దేశాలూ అదే పనిలో ఉన్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లతో ఇప్పటికే ప్రపంచకప్ సందడి మొదలైంది. ఇక సూపర్-12కు అర్హత సాధించేందుకు తొలి రౌండ్‌లో పోరాటాలు, కీలక పోరులో ప్రధాన జట్ల మధ్య ఆసక్తి రేకెత్తించే మ్యాచ్‌లు అభిమానుల కోసం ఎదురు చూస్తున్నాయి.
అసలుకు ముందు అర్హత.. టీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరానికి ముందు తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా సూపర్-12కు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్- ఎ లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, గ్రూప్- బి లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12లో ఆడే ఛాన్స్ కొట్టేస్తాయి. ఆదివారం ఈ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఈ నెల 22 నుంచి సూపర్-12 సమరం మొదలవుతుంది.
తొలి రౌండ్లో ఛాంపియన్లు.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్ తొలిసారి అర్హత రౌండ్లో పోటీపడనుంది. మరోవైపు ఓ సారి కప్పు సొంతం చేసుకున్న శ్రీలంక వరుసగా రెండో సారి అర్హత రౌండ్లో ఆడాల్సి వచ్చింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్, రన్నరప్‌తో పాటు నవంబర్ 15 నాటికి టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా సూపర్-12కు అర్హత సాధించాయి. దీంతో వరుసగా 9, 10వ స్థానాల్లో నిలిచిన శ్రీలంక, వెస్టిండీస్ నేరుగా సూపర్-12కు చేరుకోలేకపోయాయి. వీటి కంటే మెరుగైన ర్యాంకింగ్స్‌తో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ సూపర్-12లో చోటు దక్కించుకున్నాయి. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా స్కాట్లాండ్, నమీబియా, గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ, జింబాబ్వే తొలి రౌండ్ పోరుకు అర్హత సాధించాయి.
ఇప్పటివరకూ ఈ ప్రపంచకప్‌ను అత్యధికంగా రెండు సార్లు వెస్టిండీస్ (2012, 2016) సొంతం చేసుకుంది. భారత్ (2007), పాకిస్థాన్ (2009), ఇంగ్లాండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి కప్పును ముద్దాడాయి. ఇది ఎనిమిదో టీ20 ప్రపంచకప్. 2007లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు.
ఇదీ చూడండి: మహిళల ఐపీఎల్‌కు ముహూర్తం ఫిక్స్.. టీమ్‌లు, ఫార్మాట్ వివరాలు ఇలా..