టీ20 ప్రపంచకప్‌లో(T20 worldcup 2021 schedule) ఇంగ్లాండ్ జోరు తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు.. నేడు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది(england vs australia t20 2021). ఆసీస్ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 11.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (71) వీర బాదుడు బాదాడు. ఓపెనర్ జేసన్ రాయ్ (22) ఫర్వాలేదనిపించాడు. బెయిర్ స్టో (16; 11 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, అగర్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా(australia vs england)నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఆరంభలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1), స్టీవ్ స్మిత్ (1), గ్లెన్ మాక్స్ వెల్ (6), మార్కస్ స్టొయినిస్ (0) వరుసగా పెవిలియన్ చేరారు. రెండో ఓవర్లో వార్నర్ ఔట్ కాగా.. మూడో ఓవర్ తొలి బంతికే స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్ వేసిన నాలుగో ఓవర్లో మాక్స్ వెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అదిల్ రషీద్ వేసిన ఏడో ఓవర్లో మార్కస్ స్టొయినిస్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మాథ్యూ వేడ్ (18)తో కలిసి.. ఆరోన్ ఫించ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 41/4 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలోనే లివింగ్‌స్టోన్ వేసిన 12వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మాథ్యూ వేడ్.. జేసన్ రాయ్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆష్టన్ అగర్ (20)తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ జోడీ 17వ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది. టైమల్ మిల్స్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అగర్.. లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్ (12)ని పెవిలియన్ చేర్చాడు. ఆడమ్ జంపా (1), మిచెల్ స్టార్క్ (13) పరుగులు చేశారు. ఆసీస్ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు, టైమల్ మిల్స్, క్రిస్ వోక్స్ రెండేసి, అదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: లంక స్పిన్నర్ హ్యాట్రిక్.. గెలుపు మాత్రం దక్షిణాఫ్రికాదే